ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉచిత పెన్షన్ వంటి కొన్ని హామీలను ఆల్రెడీ సీఎం చంద్రబాబు అమలు చేశారు. తల్లికి వందనం పథకం పై కూడా విధివిధానాలు రూపొందుతున్నాయి. అయితే, ఏపీలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపై మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన మూడో రోజే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేశారని, కర్ణాటకలో అయితే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు వారాల లోపు ఆ పథకం అమలైందని, ఏపీలో మాత్రం ఇంకా అమలు కావడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తేదీని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకున్నామని సత్యప్రసాద్ అన్నారు. అయితే, తెలంగాణలో ఉచిత బస్సు పథకం అమలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పై కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు మహిళలు అనవసరంగా ఈ పథకాన్ని దుర్వినియోగం చేసేలాగా ప్రయాణాలు చేస్తున్నారని, తద్వారా పురుష ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే విద్యార్థినులు, ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్ మహిళలకు మాత్రమే ఉచిత పథకం అమలు చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యక్తం చేశారు. మరి ఏపీలో కూడా తెలంగాణ మాదిరిగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తారా లేదంటే కొత్త విధివిధానాలు ఏమైనా రూపొందిస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates