జగన్‌ను బూతులు తిట్టిన విజయసాయిరెడ్డి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్-2 నాయకుడిగా ఒకప్పుడు ఎంతో వైభవం చూశారు విజయసాయిరెడ్డి. జగన్‌కు నమ్మిన బంటుగా ఆయనకు పార్టీలో ఎక్కడ లేని ప్రాధాన్యం దక్కేది. కానీ గత రెండు మూడేళ్లలోపరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలో ఉండగా చాలా వరకు సజ్జల రామకృష్ణారెడ్డిదే ఆ పార్టీలో హవా. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్న విజయసాయికి వైసీపీ నుంచి ఏమాత్రం సపోర్ట్ దక్కుతున్న పరిస్థితి కనిపించడం లేదు. జగన్ ఆయన్ని ఓన్ చేసుకుంటున్నట్లయితే.. పార్టీ నేతలు చాలామంది ముందుకొచ్చి ఆయన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించేవారు. కానీ అలాంటి పరిస్థితే కనిపించడం లేదు. దీంతో విజయసాయికి, జగన్‌కు సంబంధాలు బాగా దెబ్బ తినేశాయా అన్న సందేహాలు కలుగుతున్నాయిప్పుడు.

ఇలాంటి సమయంలోనే విజయసాయి-జగన్ బంధం గురించి ఆసక్తికర విషయం బయటపెట్టారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒకప్పుడు వైసీపీలో ఉండి తర్వాత బయటికి వచ్చి ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కోటంరెడ్డి ఒకప్పుడు జగన్‌కు సన్నిహితుడిగానే ఉండేవాడు. ఈ నేపథ్యంలో విజయసాయి రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసిన సమయంలో ఆయనతో పాటు జగన్‌‌కు, తనకు మధ్య జరిగిన సంభాషణను ఓ టీవీ ఛానెల్‌‌తో ఫోన్‌ ఇన్‌లో గుర్తు చేసుకున్నాడు.

తాను, విజయసాయి కలిసి ఆ టైంలో జగన్‌ను కలవగా.. ఒక్క రాజ్యసభ కోసం ఇంతమందితో మాట్లాడాలా అంటూ జగన్ తేలిగ్గా మాట్లాడారని.. బయటికి వచ్చి కార్లో కూర్చున్నాక జగన్‌ వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో సాయిరెడ్డి బూతులు తిట్టాడని కోటంరెడ్డి చెప్పాడు. తాను జగన్ కోసం సూట్ కేస్ కంపెనీలు పెట్టానని.. విదేశాలకు తిరిగి మైనింగ్ చేశానని.. ఎంతో రిస్క్ చేసిన తనకు జగన్ ఇచ్చే మర్యాద ఇదేనా అని సాయిరెడ్డి తిట్టినట్లు కోటంరెడ్డి తెలిపాడు. అప్పటికే రాజ్యసభ ఎన్నికల కోసం సాయిరెడ్డి తన ఇళ్లు అమ్మారని.. వైసీపీ సభ్యులకు డబ్బులు పంచారని.. తాను వెంకయ్య నాయుడితో మాట్లాడి పోటీ లేకుండా చూశానని.. తాము ఇంత కష్టపడితే జగన్ మాత్రం తనను గెలిపించడానికి పెద్దగా ప్రయత్నం చేయకపోవడం పట్ల సాయిరెడ్డి వాపోయారని..ఈ విషయమై తాను ఇప్పుడు కాణిపాకంలో సత్య ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని కోటంరెడ్డి స్పష్టం చేశారు.