కోడి కత్తి శీను…ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. రాజకీయాలలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2019లో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తితో శీను దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ దాడి సింపతీతో జగన్ సీఎం అయ్యారని విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత 5 సంవత్సరాల వరకు శీను జైల్లో మగ్గిపోయాడు. ఎట్టకేలకు 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో బెయిల్ పై విడుదలయ్యాడు.
అయితే, శీనుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఈ కేసు విచారణ జరుపుతున్న ఎన్ఐఏ ఆశ్రయించింది. అయితే, ఎన్ఐఏ పిటిషన్ పై విచారణ జరిపిన దేశపు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. కోడికత్తి శీను బెయిల్ రద్దు చేయడం కుదరదని క్లారిటీనిచ్చింది. దీంతో, ఈ కేసులో ఎన్ఐఏకు చుక్కెదురైనట్లయింది.
కాగా, 2024 ఎన్నికలకు ముందు జై భీమ్ భారత్ పార్టీలో శీను చేరాడు. పేదల కోసం, వారి అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని శీను చెప్పాడు. కులమతాల కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నాడు. మరోవైపు, ఈ కేసులో ఇప్పటివరకు జగన్ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాని సంగతి తెలిసిందే. సీఎంగా బిజీగా ఉన్న జగన్ విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు చెప్పారు. మరి, ప్రతిపక్ష నేత కూడా కాని జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఫ్రీగా ఉన్నారు కాబట్టి విచారణకు హాజరవుతారా లేక మరేదన్నా కారణం చెప్పి ఎప్పటిలాగా కోర్టుకు గైర్హాజరవుతారా అన్నది వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates