కాళ్ల‌కు ద‌ణ్ణాలొద్దు.. :చంద్ర‌బాబు హిత‌వు

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మంత్రుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశా రు. గుంటూరులోని కొల‌నుకొండ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చంద్ర‌బాబు.. అనంత‌రం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. ప‌లు ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌జ‌లను చంద్ర‌బాబు ప‌ల‌కించారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారి నుంచి విన‌తి ప‌త్రాలు స్వీక‌రించారు.

అయితే.. చంద్ర‌బాబు పార్టీ కార్యాల‌యానికి చేరుకోగానే.. పొలోమని నాయ‌కులు భారీ సంఖ్య‌లో ఆయ‌న‌కు పుష్ప‌గుచ్ఛాలు స‌మ‌ర్పించారు. కొంద‌రు కాళ్ల‌కు మొక్కారు. దీంతో చంద్ర‌బాబు ఒకింత అనీజీ ఫీల‌య్యారు.

అనంత‌రం.. చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తన వ‌ద్ద‌కు వ‌చ్చే వారు ఇక నుంచి పూలు, బొకేలు, దండ‌లు తీసుకురావ‌ద్ద‌ని సూచించారు. వీటి స్థానంలో పుస్త‌కాలు తీసుకురావాల‌ని.. వాటిని పిల్ల‌ల‌కు తానే స్వ‌యం గా పంచిపెడ‌తాన‌ని తెలిపారు. ఇదొక సంప్ర‌దాయంగా అల‌వ‌రుచుకోవాల‌ని సూచించారు.

అంతేకాదు.. మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. త‌న పాదాల‌కు ఎవ‌రూ మొక్కొద్ద‌ని చంద్ర‌బాబు గ‌ట్టిగానే చెప్పారు. కాళ్ల‌కు మొక్కితే ఏమొస్తుంద‌ని ప్ర‌శ్నించారు. ఇక నుంచి ఎవ‌రైనా త‌న కాళ్ల‌కుకానీ, పాదాల‌కు కానీ, మొక్కితే..తాను కూడా తిరిగి మొక్కుతాన‌ని చెప్పారు.

అలా.. త‌న‌తో కాళ్లు మొక్కించుకోవాల‌ని కోరిక ఉన్న‌వారు మాత్ర‌మే కాళ్ల‌కు మొక్కాల‌ని వ్యాఖ్యానించారు. ప‌ర‌స్ప‌రం అభినందించుకోవ‌డం త‌ప్పుకాదన్న సీఎం.. రాచ‌రిక ధోర‌ణ‌లు ఇక‌పై వ‌ద్ద‌ని సూచించారు. మ‌రి ఎంత మంది అధినేత మాట వింటారో చాడాలి.