హ‌రీష్ రావు ఆలోచ‌న‌ల్లో బీజేపీ.. ఈట‌ల చెప్పిందేంటీ?

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించిన బీఆర్ఎస్‌కు ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితి త‌ప్ప‌డం లేదు. గతేడాది ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఆ పార్టీ మ‌నుగ‌డే ప్ర‌మాదంలో ప‌డింది. ఇక ఈ ఏడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సున్నా సీట్లు రావ‌డం కేసీఆర్‌కు దారుణ అవ‌మానాన్ని మిగిల్చింది.

మునిగిపోయే పడ‌వ లాంటి బీఆర్ఎస్‌లో ఉండ‌లేక చాలా మంది నాయ‌కులు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. కొంత‌మంది బీజేపీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అగ్ర‌నేత‌, కేసీఆర్ మేన‌ళ్లుడు హ‌రీష్ రావు సైతం పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారేమో అనే సందిగ్ధ‌త నెల‌కొంది.

హ‌రీష్ రావు బీజేపీలో చేర‌బోతున్నార‌ని గ‌తంలో జోరుగా ప్ర‌చారం సాగింది. కానీ ఆయ‌న కేసీఆర్ వెంటే న‌డిచారు. మ‌ళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్‌ను హ‌రీష్ వీడ‌తార‌నే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న క‌చ్చితంగా బీజేపీలోకి వెళ్తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

తాజాగా బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బ‌లాన్ని చేకూర్చేలా ఉన్నాయి. బీఆర్ఎస్ ఇంత‌లా ప‌త‌నం అవ‌డానికి కేసీఆర్ వైఖ‌రే కార‌ణ‌మ‌ని ఈట‌ల అన్నారు. ఆయ‌న‌లో అహంకారం పెరిగిపోయింద‌ని చెప్పారు.

అంతే తానే అనుకునే నిరంకుశ‌త్వ ధోర‌ణి కేసీఆర్‌లో ఉంద‌ని ఈట‌ల పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న‌వాళ్ల‌నూ కేసీఆర్ అవ‌మానించార‌న్నారు. 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటాన‌ని కేసీఆర్ ప‌గ‌టి క‌ల‌లు క‌న్నార‌ని ఈట‌ల ఎద్దేవా చేశారు. పార్టీలో మ‌రొక‌రికి ఎదిగే అవ‌కాశ‌మే ఇవ్వ‌లేద‌న్నారు.

అందుకే పార్టీలో ఇప్పుడు ఎవ‌రూ ఉండ‌టం లేద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే బీజేపీలో చేరే విష‌యంపై హ‌రీష్ రావు కూడా ఆలోచ‌న చేస్తుండ‌వ‌చ్చు అని ఈట‌ల వ్యాఖ్యానించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని ఈట‌ల అన్నారు. హ‌రీష్ రావు చేరిక‌పై ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇంత‌కంటే ఎక్కువ మాట్ల‌డ‌లేన‌ని చెప్పారు. దీన్ని బ‌ట్టి చూస్తే హ‌రీష్ వ‌స్తే చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది.