ఏపీ మాజీ సీఎం జగన్‌పై.. ముఖ్యమంత్రి కార్యాలయం మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌పాలనకన్నా.. బ్రిటీష్ పాలనే బెటర్ అనిపించేలా గత ఐదేళ్లు ఏపీలో పాలన సాగిందని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ తన సొంత సామ్రాజ్యంగా భావించారని తెలిపారు. ప్రభుత్వమంటే రాచరిక వ్యవస్థలా.. అధికారులంటే తన బానిసలుగా అనుకున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన ఏపీ అభివృద్ది కార్యాచరణపై జరిగిన కార్యక్రమంలో పీవీ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనలోని లోపాలను ఆయన ప్రస్తావించారు.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిశ్ర మలు, కంపెనీల ఏర్పాట్లకు ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. దీంతో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ రంగాలు భ్రష్టు పట్టిపోయాయని రమేష్ వ్యాఖ్యానించారు. బటన్ నొక్కితే చాలని.. అవే ఓట్లు రాలుస్తాయని భ్రమలో జగన్ గడిపేశారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో చాలా ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్ర ప్రగతిని ఆయన విస్మరించారని చెప్పారు.
జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టం కూడా అనేక వివాదాలకు దారి తీసిందని పీవీ రమేష్ చెప్పారు. జగన్ కన్నా బ్రిటీష్ వాళ్లే నయమని సంచలన వ్యాఖ్య చేశారు. భూమి హక్కుల విషయంలో జగన్ చట్టాలకన్నా.. బ్రిటీష్ వారు తెచ్చిన చట్టాలే బాగున్నాయని రమేష్ చెప్పారు. జగన్ తెచ్చిన భూ హక్కుల చట్టం కొత్త సమస్యలను కొని తెచ్చినట్టు అయిందన్నారు. ఎవరికీ భూమలపై హక్కులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు.
ఎవరికి ప్రయోజనం కల్పించాలని అనుకున్నారో తెలియదు. కానీ, కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఈ చట్టాలను తీసుకువచ్చారు. అందుకే ప్రజల్లో అంత వ్యతిరేకత వ్యక్తమైంది అని పీవీ రమేష్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates