హామీ ఇవ్వ‌లేదు.. అయినా ప్ర‌తిష్టాత్మ‌కం: బాబు విజ‌న్ ఇదే!

సాధార‌ణంగా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకే నానా తిప్ప‌లు ప‌డుతుంది. వాటిలోనూ కొన్నింటికి ఏదో ఒక‌ర‌కంగా కోత‌లు పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంది. గ‌త వైసీపీ స‌ర్కారు ఇదే ప‌ని చేసింద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు “అమ్మ ఒడి” ప‌థ‌కాన్ని అంద‌రికీ వ‌ర్తింప‌చేస్తామ‌ని జ‌గ‌న్ 2019 ఎన్నిక‌లకు ముందు ప‌దే ప‌దే చెప్పారు. దీంతో మ‌హిళ‌లు ఓట్లేసేశారు. కానీ, అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న యూట‌ర్న్ తీసుకుని.. అనేక నిబంధ‌న‌లు పెట్టారు.

చివ‌ర‌కు అర్హులైన కుటుంబాల్లోనూ ఒక్క‌రికి మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. దీనిలో రూ.15 వేల‌కు బ‌దులుగా రూ.13000ల‌కు స‌రిపుచ్చారు. క‌ట్ చేస్తే.. చంద్ర‌బాబు ఇప్పుడు ఒక‌వైపు ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన ప‌థ‌కాల అమ‌లుపై దృష్టి పెడుతూనే.. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని విశాల దృష్టితో ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని 5 కోట్ల పైచిలుకు ప్ర‌జ‌ల‌కు.. కుల, మ‌త‌, పేద‌, ధ‌నిక అనే సంబంధం లేకుండా.. అంద‌రికీ.. అన్ని కుటుంబాల‌కు ఆరోగ్య బీమా క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు.

క‌రోనా స‌మ‌యంలో అనేక మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌హ‌మ్మారి బారిన ప‌డి.. పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా ల‌క్ష‌ల సంఖ్య‌లో దేశ‌వ్యాప్తంగా మృతి చెందారు. వారి కుటుంబాలు చాలా వ‌ర‌కు రోడ్డున ప‌డ్డారు. దీనిపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు ప్ర‌తి కుటుంబానికీ రూ.50 వేల చొప్పున ఇవ్వాల‌ని ష‌ర‌తు విధించడంతో కొంత మేర‌కు న్యాయం జ‌రిగింది. కానీ, ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తితే.. ఎవ‌రిపైనా ఆధార‌ప‌డ‌కుండా ఉండేలా.. బీమా సొమ్ము వ‌చ్చే.. చంద్ర‌బాబు ప్లాన్ చేశారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి హామీ ఇవ్వ‌క‌పోయినా.. ఇప్పుడు ఆరోగ్య బీమాను అంద‌రికీ వ‌ర్తింపజేసేందుకు ఆయ‌న ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ప్రతి కుటుంబానికి 25లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికే ఆయూష్మాన్‌ భారత్ పేరిట 5 లక్షల ఇన్స్‌రెన్స్ అందిస్తుండగా… దీనిని కేంద్ర‌మే త్వ‌ర‌లో 10 లక్షలకు పెంచనుంది. అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారు దీనికి అదనంగా మ‌రో రూ.15 లక్షలు కలిపి ప్రజలకు అందించేలా కసరత్తు చేస్తున్నారు. అంటే.. బాధిత కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌లు అందుతాయి. దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.