యాక్షన్‌కు రియాక్షన్ వచ్చింది. అధికారం కోల్పోయిన వైసీపీపై సొంత నేతలు తిరగబడుతున్నారు. తాజాగా కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని పార్టీ అధినేత జగన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయనకు ఈ దఫా టికెట్ ఇవ్వలేదు. అయితే.. ప్రత్యర్థి పార్టీలతో అంటకాగుతూ.. సిద్దారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ పరిణామాలతో సిద్దారెడ్డి తాజాగా రియాక్షన్‌కు దిగారు. వైసీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.
ప్రాణాలు తెగించి పార్టీ కోసం తాను పనిచేశానని సిద్దారెడ్డి చెప్పారు. అలాంటి తనను కనీసం వివరణ కూడా కోరకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. తనను, తన రాజకీయాలను కూడా వైసీపీ మోసం చేసిందన్నారు. ఈ సమయంలో సిద్ధారెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీని తాను ఎప్పుడూ మోసం చేయలేదన్నారు. తన సొంత డబ్బులు కూడా ఖర్చు చేసి పార్టీ కోసం శ్రమించానని చెప్పారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చాంద్ బాషా పార్టీ ఫిరాయించినా తాను పార్టీ కోసం కష్టపడినట్టు ఆయన వివరించారు.
పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కదిరి నియోజకవర్గంలో పలు పనులు చేసినా.. ఇప్పటికి బిల్లులు ఇవ్వలేదని జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.బిల్లులు ఇవ్వకపోగా.. తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. పార్టీ అధినేతను కలుసుకునేందుకు తాను ఎన్నోసార్లు ప్రయత్నించానని.. అయినా ఒక్క నిముషం కూడా తనకు అప్పాయింట్‌మెంటు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనతో మాట్లాడేందుకు కూడా జగన్ కు మనసు రాలేదన్నారు.
తాజా ఎన్నికల్లో కొందరి నుంచి డబ్బులు తీసుకుని సీట్లు కేటాయించారని సిద్దారెడ్డి ఆరోపణలు చేశారు. పార్టీలో ఉన్న కొందరు కోవర్టుల వల్లే కదిరి నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయిందని.. తన వల్ల కాదన్నారు. అనామకుడికి వైసీపీ టికెట్ ఇవ్వడం ఏంటని.. ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వ్యతిరేకించారని తెలిపారు. అయినా.. పట్టించుకోలేదన్నారు. తప్పులన్నీ పై స్థాయిలోనే జరిగాయని నిప్పులు చెరిగారు. అందుకే పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు.