వైసీపీ అధికారంలో ఉండగా.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని మించి జనసేనను టార్గెట్ చేసేవాళ్లు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు ఆ పార్టీ నేతలంతా విరుచుకుపడిపోయేవారు. ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడు అని మారు పేర్లు పెట్టి పవన్‌ను ఎగతాళి చేసేవాళ్లు. రెండు చోట్ల ఓడిపోయాడని.. చంద్రబాబుకు అమ్ముడుబోయాడని.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. ఇలా జగన్ సహా వైసీపీ నేతలంతా తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు.
కానీ ఇటీవలి ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధించడంతో దేశమంతా పవన్, జనసేన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కూటమి ఘనవిజయం సాధించడంలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో పవన్ పాత్ర గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ నేతల స్వరం కూడా మారిపోతోంది. పవన్‌ను పేరు పెట్టకుండా ఎప్పుడూ దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అనే జనగ్ సైతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ పేరు పెట్టి సంబోధిస్తున్నారు. పవన్ బలమేంటో తెలుసుకుని వైసీపీ నేతలు కూడా ఆయనకు ఎలివేషన్లు ఇస్తున్నారు. పవన్‌ను కెలికి తప్పు చేశామని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం తెలిసిందే.
తాజాగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ పవన్‌కు మాంచి ఎలివేషన్ ఇచ్చారు. తాను పోటీ చేసి ఓడిపోయిన రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను విమర్శించే క్రమంలో పవన్‌ను కొనియాడాడు భరత్. ఆదిరెడ్డి శ్రీనివాస్ పవన్ చరిష్మాతోనే గెలిచాడని.. ఆయనే కాక తెలుగుదేశం నాయకులు చాలామంది పవన్ వల్లే విజయం సాధించారని భరత్ అన్నారు. టీడీపీ అధికారంలో ఉందంటే అందుక్కారణం పవనే అని.. ఆయనకు టీడీపీ వాళ్లు గుడి కట్టినా తప్పులేదని భరత్ వ్యాఖ్యానించడం విశేషం. ఒకప్పుడు పవన్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన భరత్ లాంటి వాళ్లు ఇప్పుడు ఆయనకు ఎలివేషన్ ఇస్తుండడం జనసైనికులకు మంచి కిక్కిస్తోంది. కానీ ఈ మాటలు టీడీపీ, జనసేన మధ్య చిచ్చు పెట్టడానికే అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates