టీడీపీ మాస్ట‌ర్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది

అధికారంలో ఉన్న టీడీపీ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తోంది. రాష్ట్రంలో 135 మంది ఎమ్మెల్యేల‌ను సొంతంగా గెలిపిం చుకుని .. కూట‌మితో క‌లిసి 164 సీట్ల‌తో అధికారం చేప‌ట్టిన టీడీపీ.. ఇప్పుడు న‌గ‌ర పాల‌న‌పైనా దృష్టి పెట్టింది.

గ‌త రెండేళ్ల కింద‌ట‌.. 2021లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అన్ని కార్పొరేష‌న్ల‌ను వైసీపీ ద‌క్కించుకుంది. విజ‌య‌వాడ‌, విశాఖ‌, చిత్తూరు, తిరుప‌తి.. విజ‌య‌న‌గ‌రం ఇలా.. అన్ని కార్పొరేష‌న్ల‌ను కూడా.. వైసీపీ సొంతం చేసుకుని పాల‌న చేస్తోంది.

అయితే.. ఇప్పుడు అధికారం మారిన ద‌రిమిలా.. క్షేత్ర‌స్థాయిలో మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌ను కూడా ద‌క్కించుకునేందుకు టీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వీటిలో మెజారిటీ కార్పొరేట‌ర్ల‌ను పార్టీలో చేర్చుకుని పాల‌నా ప‌గ్గాలు అందిపుచ్చుకునేలా పార్టీ వ్యూహాలు ర‌చించింది. ఇప్ప‌టికే చిత్తూరులో ఈ వ్యూహం స‌క్సెస్ అయింది. కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే టీడీపీ కార్పొరేట‌ర్లు ఉన్న చిత్తూరు కార్పొరేష‌న్‌లో ఇప్పుడు 18 మంది వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను చేర్చుకున్నారు.

త‌ద్వారా చిత్తూరు కార్పొరేష‌న్‌లో కూట‌మి పాల‌న వ‌చ్చేసింది. ముఖ్యంగా మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ వంటివారిని కూడా త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో టీడీపీ స‌క్సెస్ అయింది.

ఇక‌, కార్పొరేట‌ర్లు కూడా.. త‌మ‌కు నిధులు రావాలంటే.. ఓడిపోయిన పార్టీలో ఉంటేలాభం లేద‌ని భావించి.. కండువాలు మార్చేసుకున్నారు. ఇది చంద్ర‌బాబు సొంత జిల్లా కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు ఆప‌రేష‌న్ విజ‌య‌వాడ చేప‌ట్టారు. ఇక్క‌డ కూడా వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు.

అయితే.. వారిని కూడా పార్టీ మారేలా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. ఇది కూడా రెండు మూడు రోజుల్లోనే పూర్తి కానుంద‌నితెలుస్తోంది. ఈ బాధ్య‌త‌ల‌ను ఓ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడికి పార్టీ అప్ప‌గించినట్టు తెలుస్తోంది. అదేవిదంగా గుంటూరు కార్పొరేష‌న్‌లోనూ ఇదే విధానం చేప‌డుతున్నారు.

విశాఖ కార్పొరేష‌న్ కూడా.. ఒక‌టి రెండు రోజుల్లో కూట‌మి ప‌రం కానుంది. మాజీ మంత్రిగంటా శ్రీనివాసరావు.. వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునే ప‌నిలో ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి న‌గ‌ర పాల‌నను త‌న చేతిలోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.