ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటి చేయటానికి బిజెపి రెడీ అవుతోంది. వైసిపి ఎంపి బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యం కారణంగా ఈమధ్యనే మరణించారు. దాంతో ఎప్పుడో ఒకపుడు తిరుపతి లోక్ సభకు ఉపఎన్నికలు తప్పవు. ఇదే విషయమై బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన సమావేశమైన పదాదికారులు, జిల్లాల అధ్యక్షులు నిర్ణయించారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బిజెపి తరపున అభ్యర్ధిని పోటికి దింపి గెలిపించుకోవాలని సమావేశం డిసైడ్ చేసింది.
ఇదే విషయాన్ని మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా చర్చించాలని కూడా సమావేశం నిర్ణయించింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉపఎన్నికలో పోటీ చేసే విషయమై మిత్రపక్షంతో చర్చించకుండానే బిజెపి ఏకపక్షంగా నిర్ణయించేసింది. పోటీ విషయంలో బిజెపి నిర్ణయం తీసేసుకుని తీరిగ్గా పవన్ తో మాట్లాడాలని అనుకున్నది. సరే కమలపార్టీ ఎలాగు నిర్ణయం తీసేసుకున్నది కాబట్టి జనసేన అభ్యంతరం పెట్టే అవకాశం దాదాపు లేదని అనుకోవాలి. కాబట్టి మిత్రపక్షాల అభ్యర్ధిగా బిజెపి నేతే ఉంటారు.
ఇక అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి తరపున పోటీ చేయబోయేదెవరో తేలాల్సుంది. వైసిపి సంగతిని పక్కనపెట్టేస్తే టిడిపి తరపున కేంద్ర మాజీ మంత్రి, టిడిపి నేత పనబాక లక్ష్మి, సీనియర్ నేత వర్ల రామయ్య పోటి విషయంలో ఆసక్తిగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో పనబాక టిడిపి అభ్యర్ధిగా పోటిచేసి ఓడిపోయారు. కాబట్టి ఆమెకే మళ్ళీ పోటి చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక వైసిపి విషయంలో నేతల పేర్లేవీ పెద్దగా బయటకు రాలేదు. కాంగ్రెస్ ఏమి చేస్తుందో ఇంకా తేలలేదు. మొన్నటి ఎన్నికల్లో పోటి చేసిన చింతామోహన్ కు డిపాజిట్ కూడా దక్కలేదు.