వారు లేరు.. వీరు బ‌య‌ట‌కు రారు..

ప్ర‌తిప‌క్షం వైసీపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేసి నెల రోజులు అయింది. ఈ నెల రోజుల్లో పార్టీ కార్యాల‌యాల‌పై అధికారులు బుల్ డోజ‌ర్లు ప్ర‌యోగిస్తున్నారు. మ‌రోవైపు పార్టీ నాయ‌కు ల‌ను కూడా.. ఇత‌ర పార్టీలు ఆక‌ర్షిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు అలెర్ట్ కావాలి. పార్టీ నేత‌ల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయాలి. మేమున్నాంటూ.. ముందుకు రావాలి. కానీ, అలా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎవ‌రి మానాన వారు ఉన్నారు.

ముఖ్యంగా తాజాగా జ‌రిగిన‌ ఎన్నిక‌లకు ముందు.. ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను మార్చ‌డ‌మే. ఒక నియోజ‌క‌వ‌ర్గం లో ఉన్న అభ్య‌ర్థిని మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి పంపించారు. ఆయ‌న అక్క‌డ పోటీ చేసినా.. కూట‌మి సునామీ ముందు ఓడిపోయారు. దీంతో స‌ద‌రు నేత‌.. తిరిగి త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చేశాడు. ఈ గ్యాప్‌లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో నేత పుంజుకున్నాడు. ఇక‌, ఆల్రెడీ ఇక్క‌డ పోటీ చేసిన అభ్య‌ర్థి సైలెంట్ అయిపోయాడు. దీంతో పార్టీకి క్షేత్ర‌స్థాయిలో నాయ‌క‌త్వం కొర‌వ‌డింది.

ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ ప‌శ్చిమలో ఆసిఫ్ అనే మైనారిటీ నేత‌కు టికెట్ ఇచ్చారు. కానీ, ఇక్క‌డ అప్ప‌టి కే ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌ను విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి పంపించారు. ఇద్ద‌రూ ఓడిపోయారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వెల్లంప‌ల్లి తిరిగి వ‌చ్చారు. కానీ, ఇక్క‌డ ఆసిఫ్ చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రోవైపు సెంట్ర‌ల్‌లో ఉన్న మ‌ల్లాది విష్ణు త‌న‌కు బాధ్య‌త అప్ప‌గించ‌లేద‌న్న కార‌ణంగా దూరంగా ఉంటున్నారు. ఫ‌లితంగా సెంట్ర‌ల్‌లో నాయ‌కుడు లేని ప‌రిస్థితి నెల‌కొంది.

అంటే.. ఇక్క‌డ పోటీ చేసిన అభ్య‌ర్థేమో.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిపోయాడు. ఇక్క‌డ ఉన్న మాజీ ఎమ్మెల్యే త‌న‌కు బాధ్య‌త అప్ప‌గించ‌లేద‌ని దూరంగా ఉన్నారు. దీంతో వైసీపీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితి 80 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. కొంద‌రు పార్టీ మారేందు కు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది కూడా.. పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ నేప‌థ్యంలో వైసీపీఅధిష్టానం.. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తే.. త‌ప్ప‌.. క్షేత్ర‌స్థాయిలో పుంజుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.