జ‌గ‌న్ నోట ఆ డైలాగ్ ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ ?

త‌గ్గ‌డం చేత కాక‌పోతే.. నెగ్గ‌డ‌మూ క‌ష్ట‌మే- ఏ పార్టీకైనా.. ఏ నాయ‌కుడికైనా వ‌ర్తించే సూత్రం ఇది. ఈ విష యంలో 40 ఇయ‌ర్స్ ఇండస్ట్రీ చంద్ర‌బాబుతో పోల్చుకుంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ వెనుక‌బ‌డి పోయారు. చంద్ర‌బాబు ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండ‌డం.. అవ‌స‌రానికి త‌గ్గ‌డం.. నెగ్గ‌డం వంటివి ఆయ‌న రాజ‌కీయ జీవితంలో భాగంగా మారాయి. ఘ‌ర్ష‌ణ‌లు పెట్టుకున్నా.. స‌ర్దుకు పోయినందునే.. తాజాగా ఆయ‌న పార్టీ విజ‌యం ద‌క్కించుకుని నాలుగోసారి ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యారు.

కానీ, జ‌గ‌న్ విష‌యంలో మాత్రం ఇది క‌నిపించ‌డం లేదు. ఒక ఓట‌మి త‌ర్వాత‌.. మార్పు రావాలి. ఆ మార్పు అభివృద్ది దిశ‌గా ముందుకు న‌డిపించాలి. అది మేలు చేస్తుంది. కానీ.. తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం ఎదురైనా..జ‌గ‌న్‌లో మార్పు క‌నిపించ‌డం లేదు. పార్టీ నుంచి జంప్ చేసేందుకు నాయ‌కులు రెడీగా ఉన్నా రంటూ.. ఆయ‌నకు సంపూర్ణ స‌మాచారం.. అన్ని దిక్కుల నుంచి వినిపిస్తోంది. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రులు ఖాళీ అవుతున్నాయ‌ని కూడా తెలుస్తోంది.

ఇక‌, సీమ జిల్లాల్లో రెడ్లు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నార‌న్న స‌మాచారం కూడా జ‌గ‌న్‌కు తెలుసు. అయిన‌ప్ప టికీ.. ఆయ‌న త‌న పాత ధోర‌ణిని మార్చుకోవ‌డం లేదు. పోతే పోనీ.. అని తాజాగా జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బ్ర‌తిమాలి ఎన్నాళ్లు పార్టీలో కొన‌సాగిస్తామ‌నికూడా చెప్పారు. ఇది.. పోయే నాయ‌కుల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తుంది. సాధార‌ణంగా.. నాయ‌కుల సైకాల‌జీని ప‌రిశీలిస్తే.. త‌మ‌కు ప్రాధాన్యం ఉండాలని, అధినేత ద‌గ్గ‌ర మంచి పేరు రావాల‌ని ముందు కోరుకుంటారు.

ఏదైనా సంద‌ర్భం వ‌చ్చి.. ఇబ్బందుల్లో ఉంటే.. అధినేత నుంచి.. కొంత స్వాంత‌న కోరుకుంటారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఆ త‌ర‌హా స్వాంత‌న వారికి ఇవ్వ‌లేక పోతున్నారు. న‌న్ను ఎదిరించేంత పెద్ద నేత‌లా? అని జ‌గ‌న్ భావిస్తున్నారు. గ‌తంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటం రెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి వంటివారు.. పార్టీ నుంచిదూరమ‌య్యారు. అయితే.. వీరికి జ‌గ‌న్ నుంచి చిన్న స్వాంత‌న ల‌భించి ఉంటే.. పార్టీలోనే ఉండేవారు. కానీ, ఆ దిశ‌గా జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇప్పుడు కూడా.. అదే ధోర‌ణిని ఆయ‌న పాటిస్తున్నారు. ఫ‌లితంగా జ‌గ‌న్ కోరి కోరి క‌ష్టాలు తెచ్చుకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.