వ్యక్తిగతంగా అయినా.. సంస్థాగతంగా అయినా.. అప్‌డేషన్(ఆధునీకరణ) అనేది కీలకం. ఇక, రాజకీయాల్లోనూ నూతన నిర్ణయాలు.. నూతన పంథాలను ఎంచుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా చేయని పార్టీలు… మనుగడలో లేని విషయం.. ప్రజల ఆదరణకు నోచుకోని విషయం మనకు తెలిసిందే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కాంగ్రెస్ పార్టీనే. అదేసమయంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా. తాము నమ్మడిన సిద్ధాంతానికి పరిమితమై.. అప్‌డేట్ కాకుండా.. ప్రజల ఆలోచనా ధోరణులతో మమేకం కాని నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజాదరణను కోల్పోయింది.
ఇప్పుడు వైసీపీ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు ఎలా ఉన్నా.. మున్ముందు మాత్రం ఆ పార్టీ వ్యూహాలు మారాల్సి ఉంది. మార్చుకోవాల్సి కూడా ఉంది. గతంలో ఎన్టీఆర్ కూడా.. నిర్ణయాలను కేంద్రీకృతం చేశారు. ఫలితంగా ఆయనకు తొలిసారి దక్కిన విజయం రెండోసారి దోబూచులాడింది. దీంతో మండలస్థాయిలో పార్టీని పటిష్టం చేసి.. నాయకులకు కొన్ని స్వేచ్ఛలు కల్పించారు. ఫలితంగానే మండలస్థాయిలో పార్టీ ముందుకు సాగింది. దీంతో టీడీపీకి బలమైన క్షేత్రస్థాయి నాయకత్వం ఏర్పడింది. ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
ఇప్పుడు వైసీపీ కూడా కేంద్రీకృతమైన అధికార నిర్ణయాలను మండలాలు.. నగరాలు.. పంచాయతీల స్థాయికి విస్తరించాలి. పార్టీ అంటే.. జగన్‌ది! అనే భావన ను పోగొట్టి.. పార్టీ అంటే.. మనది అనుకునేలా వ్యవహరించాల్సి ఉంటుంది. అలా చేస్తే.. పార్టీ మనుగడకు ప్రాధాన్యం ఉంటుందని గుర్తించాలి. అదే సమయంలో జిల్లాల స్థాయిలో నాయకత్వాలను ప్రక్షాళన చేయడం ఇప్పుడు ప్రధమకర్తవ్యంగా జగన్ చేప ట్టాలి. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకుని వాటిని సరిచేయాల్సి ఉంది.
అలానే.. ప్రస్తుతం ఉన్న నాయకుల పనితీరును అసెస్ చేయాల్సి ఉంది. తరచుగావీడియో.. టెలిఫోన్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ.. పార్టీ పక్షాన కార్యకర్తలకు అండగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు పార్టీ బలపడతుంది. కొత్త రక్తానికి చోటు ఇవ్వాలన్న కాంక్ష వారసులకు పరిమితం కావడం సరికాదన్న విషయాన్ని టీడీపీ గుర్తించింది. అదేసయమంలో ఆశావహులను కూడా ఈ ఎన్నికల్లో ప్రోత్సహించింది. మనం అధికారంలోకి రావాలి! అనే కోరికను పెంచేలా చేసింది. ఇప్పుడు వైసీపీ కూడా.. అదే పంథాను అనుసరిస్తే.. ఇబ్బందులు తప్పి.. మరోసారి అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటుంది.