టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారి అరెస్టు

జగన్ హయాంలో టీడీపీ నేతలు మొదలు టీడీపీ ఆఫీసుల వరకు అన్నింటిపై దాడులు చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. నాటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి పాల్పడే ప్రయత్నం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇక అదే రీతిలో 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా గతంలో వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పాలనలో ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. నిందితులు అరెస్ట్ కాలేదు.

ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తాజాగా ఆ కేసుకు సంబంధించి ఐదుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుంటూరుకు చెందిన వెంకటరెడ్డి, మస్తాన్ వలి, దేవానందం, రాంబాబు, మొహిద్దీన్ తదితరులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయం పై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైసీపీ మూకలు దాడికి తెగ బడ్డాయి.

అయితే, ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నిందితులను గుర్తుపట్టే పనిలో పడ్డారు. సీసీ కెమెరాల ద్వారా ఈ విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఈ దాడిలో ఎక్కువగా పాల్గొనట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టుగా నిందితుల్లో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

మరికొందరు టిడిపిలో చేరుతామని, అరెస్టు చేయొద్దని రాయబారాలు కూడా పంపుతున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైసిపి నేతలు, విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారిలో కొందరిని అరెస్టు చేయగా మరికొందరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.