పరదాల సీఎం టు ప్రజా సీఎం

ఏపీ మాజీ సీఎం జగన్ కు పరదాల ముఖ్యమంత్రి అన్న పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ఎక్కడకు వెళ్లినా పరదాలు కట్టడం, ఆ దారిలో చెట్లు కొట్టడం వంటి కార్యక్రమాలతో ఇటు అధికారులు, అటు పోలీసులు, ఇటు ప్రజలకు విసిగి పోయారు.

కట్ చేస్తే, ఏపీ సీఎంగా చంద్రబాబు రాగానే పరదాలు తీసేసి ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా ముఖ్యమంత్రిగా మారారు. ఆ క్రమంలోనే తాను మాట ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్లో జూలై 1వ తేదీ నుంచి రూ.4వేల పెన్షన్ పంపిణీకి స్వయంగా ఆయనే శ్రీకారం చుట్టారు.

ఉదయం 6 గంటలకు స్వయంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని చంద్రబాబు ఈరోజు ఉదయం మంగళగిరిలోని పెనుమాక ఎస్సీ కాలనీల లబ్ధిదారుడి ఇంటికి స్వయంగా వెళ్లి అందించారు.

అతడికి రూ.7000 పెన్షన్ అందజేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎక్కడికక్కడ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ చేశారు.

మంగళగిరిలో పెన్షన్ పంపిణీ సందర్భంగా చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్, పలువురు అధికారులు ఉన్నారు. తొలిరోజే 100% పంపిణీ పూర్తి చేయాలని ఏపీ సిఎస్ నీరభ్ కుమార్ ను చంద్రబాబు ఆదేశించారు.

కొన్నిచోట్ల ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను వాడుకోవాలని అధికారులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక, తొలి రోజు పెన్షన్ అందుకోలేకపోయిన వారికి రెండో రోజు ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి పెన్షన్ అందజేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి పరదాల ముఖ్యమంత్రి పోయి ప్రజా ముఖ్యమంత్రి వచ్చాడని చంద్రబాబుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.