చంద్రబాబులో జనం కోరుకునేది ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి విజనరీ లీడర్ అనే పేరు కొన్ని దశాబ్దాల కిందటే వచ్చింది. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా.. భవిష్యత్ దిశగానే ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఐతే రాజకీయ ప్రత్యర్థులు ఈ విషయంలో ఆయన ఎటకారాలాడుతుంటారు. ‘ఇజనరీ’ అంటూ ఎద్దేవా చేస్తుంటారు.

కానీ చంద్రబాబు నిజంగా విజనరీ లీడర్ అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా వాటిని పట్టించుకోరు. 2014-19 మధ్య అధికారంలో ఉండగా ఆయన పోలవరం ప్రాజెక్టును ఎలా పరుగులు పెట్టించారో అందరికీ తెలుసు. అప్పుడే 70 శాతం పనులు పూర్తయిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తిరోగమనం పట్టించింది. రివర్స్ టెండరింగ్ పేరుతో 500 కోట్లు ఆదా చేశామని చెప్పుకున్నారు కానీ.. మధ్యలో పనులు ఆపేయడం వల్ల వేల కోట్ల నష్టం వచ్చిందని నిపుణులే చెప్పారు.

తాజాగా చంద్రబాబు సోమవారం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఒక సామాన్యురాలు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఎందుకు చెప్పలేకపోతున్నారంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన వివరణ చూస్తే ఆయనకు ఎవ్వరైనా సెల్యూట్ కొట్టాల్సిందే.

ఓవైపు పోలవరం తమకు అర్థం కాలేదంటూ అంబటి రాంబాబు లాంటి మాజీ మంత్రులు స్టేట్మెంట్స్ ఇస్తే.. చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్టు లోతు పాతుల గురించి, సాంకేతిక విషయాల గురించి ఎంతో వివరంగా చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం మీద ఆయనకు ఎంత లోతైన అవగాహన ఉందో ఆ మాటలు వింటే అర్థమవుతుంది.

జగన్ సర్కారు మధ్యలో రివర్స్ టెండరింగ్ పేరుతో చేసిన జాప్యం వల్ల ఎంత నష్టం జరిగిందో ఆయన ఈ సందర్భంగా వివరించారు. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, మళ్లీ ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు ఎంత కసరత్తు చేస్తున్నది కూడా ఆయన వివరించారు. ఇంత సబ్జెక్ట్, తపన ఉన్న నాయకులు అరుదుగా ఉంటారని వీడియో చూస్తే అర్థమవుతుంది.