కొండగట్టులో తల్వార్ పట్టిన పవన్..వైరల్

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి వెళ్లారు. ఇక్కడ ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజన్నకు పవన్ తన మొక్కులను చెల్లించుకున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో కూడా కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే. కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ పూజారులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. ఇక, పవన్ కళ్యాణ్ కు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

పవన్ రావడంతో కొండగట్టులో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగి పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు క్రేన్ సాయంతో భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. అనంతరం తల్వార్ చేతబట్టిన పవన్ కళ్యాణ్ దానిని చూపిస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు.

అయితే, ప్రస్తుతం అమ్మవారి దీక్షలో ఉన్నాను కాబట్టి తెలంగాణలోని జనసేన నేతలు, జన సైనికులు, అభిమానులను కలవలేనని, మరోసారి సమావేశం ఏర్పాటు చేసి అందర్నీ కలుస్తానని పవన్ చెప్పారు. తెలంగాణలో జనసేన బలోపేతానికి త్వరలోనే పవన్ ఇక్కడ నేతలు, కీలక కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణలో కూడా పవన్ తన మార్కు రాజకీయాలు చూపించబోతున్నారని తెలుస్తోంది.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో డీఎస్ బలంగా తన వాదాన్ని వినిపించారని పవన్ గుర్తు చేసుకున్నారు. డీఎస్ మృతి పట్ల ఏపీ మంత్రి, జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా సంతాపం తెలిపారు. డీఎస్ మరణం బాధాకరమని… ఆయన అత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు.