చంద్రబాబుకు డేంజర్ బెల్స్..పెరిగిపోతున్న ప్రత్యేక గ్రూపు

అసెంబ్లీలో చంద్రబాబునాయుడుకు డేంజన్ బెల్స్ మోగేట్లే ఉన్నాయి. టీడీపీకి రాజీనామా చేసిన ఎంఎల్ఏలందరు అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా తయారవుతున్నారు. ఇప్పటికి ప్రత్యేక గ్రూపుగా తయారైన ఎంఎల్ఏల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మొదటగా పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ తనను అసెంబ్లీలో ప్రత్యేక సభ్యునిగా పరిగణించాలని రిక్వెస్ట్ చేశారు. తనకు టీడీపీకి సంబంధం లేదని కాబట్టి అసెంబ్లీ తాను టీడీపీ సభ్యులతో కలిసి కూర్చునే అవకాశం లేదన్నారు. కాబట్టి తనను స్వతంత్రసభ్యునిగా పరిగణించి ప్రత్యేకంగా సీటు చూపించాలని అడిగినపుడు స్పీకర్ సానుకూలంగా స్పిందించారు.

అందుకే అసెంబ్లీలో వంశీ టీడీపీ సభ్యులతో కాకుండా ప్రత్యేకంగా కూర్చుంటున్నారు. తర్వాత రోజుల్లో వంశీకి గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మద్దాలి గిరి, ప్రకాశం జిల్లాలోనీ చీరాల ఎంఎల్ఏ కరణం బలరామ్ తోడయ్యారు. తాజాగా వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ జతకలిశారు. అంటే మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో నలుగురు దూరమయ్యారు. అంటే అసెంబ్లీలో అధికారికంగా వైసిపి, టీడీపీ ఉండగా అనధికారికంగా ప్రత్యేక గ్రూపు తయారవుతోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రోజురోజుకు అనధికార గ్రూపు పెద్దదైపోతోంది.

రానున్న రోజుల్లో మరికొందరు ఎంఎల్ఏలు టీడీపీకి దూరమైపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. నిజంగా ఇదే జరిగితే అప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపు బలం పెరిగిపోయి టీడీపీ మైనారిటిలోకి పడిపోతోంది. అప్పుడు తెలంగాణాలో ఏర్పడిన పరిస్ధితులు తలెత్తినా ఆశ్చర్యపోవక్కర్లేదు. తెలంగాణాలో కూడా అసెంబ్లీలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఇదే జరిగింది. మెజారిటి టిడిపి ఎంఎల్ఏలు టీఆర్ఎస్ వైపు ఫిరాయించి తమదే అసలైన టీడీపీ అని స్పీకర్ కు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో అసెంబ్లీలో స్పీకర్ ఎంఎల్ఏల కౌంట్ ప్రకారం చీలిక వర్గానిదే అసలైన టీడీపీ అంటూ నిర్ధారించేశారు. ఆ తర్వాత వాళ్ళంతా టీఆర్ఎస్ లో వీలీనం అయిపోయిన విషయం వేరే సంగతి. ప్రస్తుతం తెలంగాణా అసెంబ్లీలో టీడీపీ బలం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఇదే పరిస్ధితి ఏపి అసెంబ్లీలో వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

2014-19 మధ్యలో వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 23 మందితో పాటు ముగ్గురు ఎంపిలను చంద్రబాబు పార్టీలోకి లాగేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ ఎంఎల్ఏలు వైసిపికి ఏ విధంగా మద్దతుగా నిలబడుతున్నారో అప్పట్లో వైసిపి ఎంపిలు కూడా టీడీపీకి అలాగే మద్దతుగా నిలిచారు. అధికారికంగా టీడీపీలో చేరకపోయినా అనధికారికంగా టిడిపీ సభ్యులుగానే కంటిన్యు అయిపోయారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు అవసరం లేకపోయినా ప్రయత్నించారు. ఇపుడు జగన్ కూడా చంద్రబాబును ఫాలో అవుతున్నారంతే.