తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఏపీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన.. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లాలోని ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఆయన సత్కరించారు. అనంతరం.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ అయ్యారు.
సాధారణంగా ఒక రాష్ట్ర గవర్నర్ వద్దకు ముఖ్యమంత్రులు వస్తారు. ఎందుకంటే ప్రొటోకాల్ ప్రకారం.. ముఖ్యమంత్రి గవర్నర్ కన్నా.. రెండో స్థానంలో ఉంటారు.కానీ, ఏపీలో జరిగిన పరిణామం చూస్తే.. ఊహించనిదేనని అంటున్నారు. అయితే.. ఇలా నేరుగా తెలంగాణ గవర్నర్ ఏపీకి వచ్చి.. ఇలా ముఖ్యమంత్రితో భేటీ కావడం వెనుక ఏం జరిగి ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజన అంశాలు సహా.. కేంద్రం నుంచి నిధులు.. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా ఆస్తుల పంపకం కూడా వివాదంగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఆసక్తిగా మారింది. కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ భాగస్వామ్య పార్టీగా ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం సహకారం అందించే అవకాశం మెండుగా ఉంది. ఈ క్రమంలో.. కేంద్రం సూచనల మేరకే.. గవర్నర్ ఏపీకి వచ్చారా? రాష్ట్ర సమస్యలపైనే చర్చించారా? అన్నది చర్చగా మారింది.
అయితే.. విభజన సమస్యల విషయంలో గవర్నర్ పాత్ర కీలకమేమీ కాదు. ఇరు ప్రభుత్వాలు కూర్చుని మాట్టాడాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రాధాన్యాల విషయంలో రాజీ పడబోమన్నారు. విభజన సమస్యలు సహా అన్ని విషయాల్లోనూ నిబంధనలు,చట్టం ప్రకారమే ముందుకు సాగుతామన్నా రు. అంటే.. నిజానికి విభజన సమస్యలపైనే గవర్నర్ వచ్చి ఉంటే.. ఇది ప్రభుత్వ సహకారం లేకుండా జరిగే పనికాదు. మరి ఈ భేటీ వెనుక ఉన్న అసలు విషయం ఏంటనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates