“నాకు రక్షణగా గన్‌మెన్లు అవసరం లేదు. నాకు ఎవరూ శత్రువులు లేరు. నేను అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేశాను. ప్రజలతో నిత్యం ఉన్నాను. సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడమే నాకు మంచిది” అంటూ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పిన మాటల వెనక అంతర్యం వేరే ఉందా ? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఆయన గన్ మెన్లను తిప్పిపంపిన వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తరాంధ్ర నుండి కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదని ఆ వర్గం అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. మిగతా నేతలు అంతా గుంబనంగా ఉండి బయటపడడం లేదని, రవికుమార్ మాత్రం తొందరగా బయటపడ్డాడని చెబుతున్నారు. గవర్నమెంట్ కేటాయించిన గన్‌మెన్‌లను వెనక్కు పంపడం అందుకే అని అంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గం నుండి రవికుమార్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారారంపై 35032 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన రవికుమార్ 1994లో రాజకీయాల్లోకి వచ్చాడు. పొందూరు మండలానికి ఎం.పి.పిగా, జెడ్.పి.టి.సి ఎన్నికయ్యాడు. ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి విప్ గా బాధ్యతలు నిర్వహించాడు. 2014లో 5 వేల మెజారిటీతో విజయం సాధించిన రవికుమార్, 2019లో 14 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. తమ్మినేని సీతారాం భార్యకు రవికుమార్ స్వయానా తమ్ముడు కావడం విశేషం. మరి గన్ మెన్ల వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates