రాజ‌ధాని రైతుల క‌ష్టాలు తీరేనా..!

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి స్థిర‌ప‌డింది. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది కాబ‌ట్టి.. అమ‌రావ‌తికి ఢోకాలేదు. ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతాయి. కానీ, ఇప్పుడు అస‌లు స‌మ‌స్య రైతుల‌తోనే ఉంది. వారికి దాదాపు ఏడాది కాలంగా నిధులు ఇవ్వ‌డం నిలిచిపోయింది. నిబంధ‌న‌ల మేర‌కు వారికి నెల నెలా పింఛ‌న్లు ఇవ్వాలి. ఇవి ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో ఏటా ఒక‌సారి కౌలు చెల్లించాలి. ఈ విష‌యంలోనే వైసీపీ స‌ర్కారు రైతుల‌ను ప‌క్కన పెట్టింది.

వారు అనేక ప‌ర్యాయాలు కోర్టుల‌కు వెళ్లి.. కౌలు సొమ్ములు తెచ్చుకున్నారు.కానీ, ఏడాదిన్న‌ర‌గా వారికి నిధు లు ఆగిపోయాయి. దీంతో అప్ప‌ట్లోనే హైకోర్టులో కేసులు వేశారు. ప్ర‌స్తుతం అవ‌న్నీ విచార‌ణ ద‌శ‌లోనే ఉన్నాయి. దీంతో నిధులు ఇవ్వ‌డంలో వైసీపీప్ర‌భుత్వం త‌ప్పించుకుంది. ఇప్పుడు ఈ సొమ్ములు సుమా రు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నాయ‌ని తెలుస్తోంది. 33 వేల ఎక‌రాల పొలాల‌కు సంబంధించి కొంద‌రు మెట్ట భూములు ఇస్తే.. మ‌రికొంద‌రు మాగాణి భూములు ఇచ్చారు.

వీటికి ఆయా భూములను బ‌ట్టి.. కౌలు చెల్లించాలి. కొంద‌రికి ఇది ఏడాదికి 30 వేల రూపాయ‌లు ఉండ‌గా.. మ‌రికొంద‌రికి ఎక‌రానికి రూ.50 వేలు, ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు కూడా ఉంది. మూడు పంట‌లు పండే భూముల‌కు రూ.2 ల‌క్షల వ‌ర‌కు కౌలు ప్ర‌భుత్వ‌మే ఇవ్వాలి. ఈ సొమ్ములను ఏడాదిన్న‌ర‌గా వైసీపీ ప్ర‌భుత్వం నిలిపి వేసింది. దీంతో రైతులు అప్ప‌ట్లోనే న్యాయ పోరాటం చేశారు. స‌రే.. ప్ర‌భుత్వం మారిపోయింది. ఇప్పుడు.. చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంపై స‌ర్కారును ఒత్తిడి చేయ‌లేక‌.. అలాగ‌ని.. మౌనంగా ఉండ‌లేక‌.. రైతులు ఇబ్బందులు ప‌డు తున్నారు. చంద్ర‌బాబు కు అర్జీలు స‌మ‌ర్పించేందుకు రైతులు రెడీ అవుతున్నారు. అయితే..ఎలానూ రాజ‌ధాని ప‌ట్టాలెక్కుతున్న నేప‌థ్యంలో ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని స‌ర్కారు చెబుతోంది. దీంతో రైతులు కొంత మేర‌కు ఆశ‌గానే ఎదురు చూస్తున్నా.. నిధుల విష‌యంలో ఏదో ఒకటి తేల్చాల‌ని వారు కోరుతున్నారు.