అయిందేదో అయిపోయింది. ప్రజలు తీర్పు చెప్పేశారు. చంద్రబాబు కావాలనుకున్నారు. ఏకపక్షంగా వేసేశారు. ఇప్పుడు అరుపులు.. గగ్గోళ్లు పెట్టుకుని ప్రయోజనం లేదు. ఇచ్చిన తీర్పునకు బద్ధులై ఉండడం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పద్ధతి. విధేయత. ఈ విషయంలో కూటమి సర్కారు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం.. లేఖలు సంధించడం కాకుండా.. బాధ్యతాయుత మాజీ ముఖ్యమంత్రిగా, అంతకన్నా బాధ్యతాయుత 40 శాతం ఓట్లు తెచ్చుకున్న కీలక పార్టీ అధ్యక్షుడిగా జగన్ కీలక రోల్ పోషించేందుకు ముందుకు రావాలన్నది మేధావులు చెబుతున్న మాట.
గతం తవ్వుతారు. తప్పులు వెతుకుతారు. మైకులు ఇవ్వరు.. అవమానిస్తారు. కేసులు కూడా పెడతారు! – ఎస్! ఇవన్నీ జరిగితేనే.. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎలా ఉండాలో తెలుస్తాయి. 100 మందిని ఏకపక్షంగా గెలిపించుకున్న కాంగ్రెస్‌కు కూడా.. కేంద్రంలో ఇప్పుడు ఆటుపోట్లు తప్పడం లేదు. పదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీకి.. ప్రజలు ఇచ్చింది కాసిన్ని సీట్లే. అయినా.. పార్టీ బెరుకు చూపలేదు. ధైర్యంగా ప్రజల పక్షాన నిలుస్తామని చెబుతోంది. అంతేకాదు.. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. గత 2019-24 మధ్య అతి పెద్ద కాంగ్రెస్ పార్టీకి జనాలు ఇచ్చిన స్థానాలు 51. వీటిలోనూ ముగ్గురు ఎంపీలను మోడీ లాగేశారు. దీంతో మిగిలింది 48. అయినా.. పార్టీ కుంగిపోలేదు.
తమకు ప్రతిపక్ష హోదాలేదని.. ఇవ్వలేదని.. ఎక్కడా ఆవేదన చెందలేదు. తమకు ఉన్న అనుకూల మార్గాల ద్వారా.. తమకు ఉన్న వెసులుబాట్లను వినియోగించుకుంటూ.. ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేసింది. మణిపూర్ రగడను భుజాన వేసుకుంది. ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించింది. రాజ్యాంగ రక్షణకు నడుం బిగించింది. ఫలితంగా అసలు ఉంటుందా? మోడీ దూకుడుతో పార్టీ కొట్టుకు పోతుందా? అన్న స్థాయి నుంచి కోలుకుని పూర్వస్థితికి చేరుకునేలా పరుగులు ప్రారంభించింది. సో.. దేశంలో ప్రజాస్వామ్యం అంటే.. ఇంతే!
కాబట్టి .. జగన్ చేయాల్సింది ప్రజల తరఫున గళమై.. వారికి బలమై.. సమస్యలపై పోరాటం చేస్తే.. గత తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే.. కూటమి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా.. ప్రజలే రేపు గౌరవిస్తారు. ఈ అంతః సూత్రాన్ని విస్మరించి.. దండలో దారం లేదన్నట్టుగా వ్యవహరిస్తే.. మరిన్ని ఇబ్బందులు తప్పవు. శాసన సభలో బలం లేకపోవచ్చు. కానీ, మండలిలో ఉంది. ఇక్కడ వివేచనతో వ్యవహరిస్తే.. వైసీపీ వ్యవహారం సానుకూలమై.. ప్రజల్లో సానుభూతి పవనాలకు దారి తీస్తుంది. సో.. సర్కారుపై కాదు.. సమస్యలపై సమరం చేయాల్సి ఉంటుందని మేధావులు జగన్‌కు సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates