‘డిప్యూటీ స్పీక‌ర్’ విష‌యంలో మోడీ స‌ర్కారు భ‌యం ఇదేనా?

డిప్యూటీ స్పీక‌ర్‌- ఇదీ.. ఇప్పుడు దేశ రాజ‌కీయాలను కుదిపేస్తోంది. ఈ ప‌ద‌వి విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. కాదు కాదు.. సంప్ర‌దాయాలు పాటించాల‌ని కోరుతున్నాయి. “మీరు స్పీక‌ర్ తీసుకోండి. మేం సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తాం. కానీ, ప్ర‌తిప‌క్షానికి డిప్యూటీ స్పీక‌ర్ పోస్టు ఇవ్వండి. త‌ర‌త‌రాల పార్ల‌మెంటు సంప్ర‌దాయాల‌ను కాపాడండి” అని ప్ర‌తిప‌క్ష కూట‌మి చెవినిల్లు క‌ట్టుకుని పోరాడుతోంది. కానీ, ఈ విష‌యంలో బీజేపీ నేతృత్వంలోని కూట‌మి మాత్రం స‌సేమిరా అంటోంది.

స్పీక‌ర్ ప‌ద‌వి విష‌యంలో మీరంతా స‌హ‌క‌రించండి అంటూ.. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి విష‌యాన్ని దాచేస్తోంది. అంటే.. ‘నీ కంట్లో నా వేలు పెడ‌తా.. నా నోట్లో నీ వేలు పెట్టు’ అన్న చందంగా మోడీ స‌ర్కారు వ్య‌వ హ‌రిస్తోంది. మొత్తంగా చూస్తే.. ప్ర‌తిప‌క్షాల‌ను ఏదో ఒక ర‌కంగా తొక్కిపెట్టాల‌న్న వ్యూహం అయితే.. మోడీ స‌ర్కారు వ‌ద్ద స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే.. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఇస్తే.. మోడీ స‌ర్కారుకు పోయేదేంటి? అనే సందేహం రావొచ్చు! ఇది రావాలి కూడా.

నిజానికి డిప్యూటీ స్పీక‌ర్ అంటే.. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వి కాదు. అసెంబ్లీ అయినా. పార్ల‌మెంటు అయినా అంతే. కానీ, ఇదొక సంప్ర‌దాయం. స్పీక‌ర్‌కు చేదోడు. స్పీక‌ర్ రాలేని ప‌రిస్థితిలో లేదా.. ప‌ని ఒత్తిడి ఉన్న ప్పుడు.. డిప్యూటీ స్పీక‌ర్ స‌భ‌ను న‌డిపిస్తారు. ఇది ఎప్ప‌టి నుంచో ఉన్న ప‌ద్ధతి, విధాన‌మే. కానీ.. ఏమాత్రం ప్రాధాన్యం లేక‌పోయినా.. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని సైతం మోడీ విప‌క్షాల‌కు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. 2019-2024 మ‌ధ్య అస‌లు డిప్యూటీ స్పీక‌ర్ లేకుండానే ఐదేళ్లు స‌భ‌ను లాగించేశారు.

ఇప్పుడు కూడా అలానే చేయాల‌ని మోడీ ప్లాన్‌. కానీ, ఇప్పుడు విప‌క్షానికి 250 స్థానాలు ఉన్నాయి. దీంతో వీరు కూడా ప‌ట్టుబ‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. మోడీ పెంకిత‌నం మాన‌డం లేదు. ఇక‌, దీనివెనుక ఏమైనా వ్యూహం ఉందా? అంటే.. కొన్ని అనుమానాలు వ‌స్తున్నాయి. స్పీక‌ర్ కార్యాల‌యానికి కేంద్రం నుంచి బిల్లులు ముందే వ‌స్తాయి. వీటిని ర‌హ‌స్యంగా ఉంచుతారు. అయితే..డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి విప‌క్షానికి ఇస్తే.. వీటిని ఎక్క‌డ లీకుచేస్తారో.. అనే బెంగ మోడీ స‌ర్కారుకు ఉండి ఉంటుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా.. డిప్యూటీ స్పీక‌ర్ విష‌యంలో మోడీ అనుస‌రిస్తున్న తీరు విమ‌ర్శ‌నాత్మ‌కం.