ఉండిలో హుండీ తెరిచిన ట్రిపులార్‌.. !

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి మార్పులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామ‌రాజును ప‌క్క‌న పెట్టి మ‌రీ.. వైసీపీ నుంచి వ‌చ్చి.. ఆ పార్టీపై యుద్ధం చేసిన ర‌ఘురామ‌రాజుకు.. చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు.

ఈ ప్ర‌క్రియ‌లో అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి ర‌ఘురామ‌ గెలిచారు. అయితే.. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో భారీ హామీలు గుప్పించారు.

తాను గెలిస్తే.. ఉండిని అద్భుతంగా తీర్చి దిద్దుతాన‌న్నారు. దీనిని ప్ర‌జ‌లు విశ్వ‌సించి.. ఆయ‌న‌పై అభిమానం చూపారు. గెలుపు గుర్రం ఎక్కించారు. అయితే.. అభివృద్ది విష‌యంలో స‌ర్కారు నుంచి సాయం తీసుకుందామంటే.. ఆర్థికంగా స‌ర్కారు ఇబ్బందుల్లో ఉంది.

గ‌త జ‌గ‌న్ స‌ర్కారు మాదిరిగానే ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా అప్పులు చేయ‌కుండా న‌డిచేలా లేదు. దీంతో ప్ర‌భుత్వం ముందు ప్ర‌తిపాద‌న పెట్టినా ప్ర‌యోజ‌నం లేద‌ని ఆర్ . ఆర్ .ఆర్ . గుర్తించారు.

ఈ నేప‌థ్యంలో తెలివిగా ఆయ‌న హుండీ తెరిచారు. ఇదేమీ.. అవినీతి కోసం కాదు.. అక్ర‌మాల కోసం కాదు. సాయం కోసం. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోస‌మే. క్రౌడ్ ఫండింగ్‌.. అంటే సామూహిక విరాళాల సేక‌ర‌ణ‌కు ర‌ఘురామ గ‌ల్లా రెడీ చేశారు. ఇది మంచి నిర్ణ‌య‌మే త‌ప్పేమీ కాదు.

ఏదైనా ఆప‌ద‌లు, ప్ర‌కృతి విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు.. ప్రభుత్వాలు కూడా.. ఇలా సొమ్ములు క‌లెక్ట్ చేస్తాయి. దీనిలో ఎవ‌రిపైనా బ‌ల‌వంతాలు ఉండ‌వు. ఎవ‌రినీ ఒత్తిడి చేయ‌డం కూడా ఉండ‌దు.

ఇదే విధానాన్ని ర‌ఘురామ చేప‌ట్టారు. దేశ‌, విదేశాల్లో ఉన్న ఉండి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తోపాటు.. స్వ‌చ్ఛంద సంస్థ‌లు.. అభివృద్ధి కాముకుల నుంచి కూడా.. ఆయ‌న విరాళాలు సేక‌రిస్తున్నారు. తొలుత ఫండింగ్‌గా తానే రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సొమ్మును జ‌మ చేశారు.

అనంత‌రం.. త‌న‌కు తెలిసిన పారిశ్రామిక వేత్త‌లు, ఎంపీల‌కు కూడా.. సందేశాలు పంపించారు. క్రౌడ్ ఫండింగ్కు స‌హ‌క‌రించాల‌ని విన్న‌వించారు. మొత్తానికి ఈ ప్ర‌య‌త్నం బాగున్నా.. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసే స్థాయిలో వ‌స్తాయా? రావా? అన్న‌ది చూడాలి.