జగన్ వెర్సస్ పవన్.. ఎంత తేడా

రెండు మూడేళ్ల కిందట వైఎస్ జగన్ ప్రభుత్వం దెబ్బకు టాలీవుడ్ ఎంతగా అల్లాడిపోయిందో గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని టార్గెట్ చేసే క్రమంలో ఏపీ అంతటా టికెట్ల ధరలను తగ్గించేసి సినిమాలను నమ్ముకున్న వాళ్లంతా విలవిలలాడిపోయేలా చేసింది జగన్ సర్కారు.

రేట్ల పెంపు కోసం చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలు రకరకాలు ప్రయత్నాలు చేసి… చివరికి ముఖ్యమంత్రి జగన్‌ను కూడా కలిసి వచ్చారు. ఆ టైంలో చిరుతో పాటు ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్లతో నాటి సీఎం జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.

కారు బయట పెట్టించి నడుచుకుని తన కార్యాలయానికి వాళ్లంతా వచ్చేలా చేయడమే కాదు.. చిరు లాంటి లెజెండరీ పర్సనాలిటీ జగన్‌కు దండం పెట్టి సమస్య తీర్చాలని అడుక్కునేలా చేయడం చాలామందికి రుచించలేదు.

కట్ చేస్తే ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. జనసేన కూడా భాగస్వామి అయిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన పార్టీకే చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యత తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నిర్మాతల బృందం పవన్‌ను వెళ్లి అమరావతిలో కలిసి వచ్చింది. అప్పుడు జనగ్ దగ్గరికి చాలామంది బలవంతంగా వెళ్లారు. అన్యమనస్కంగానే ఆ బృందం వెళ్లి జగన్‌కు సలాం కొట్టి వచ్చింది.

కానీ ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎంతో సంతోషంగా పవన్ దగ్గరికి వెళ్లారు. పవన్ వారికి సాదర స్వాగతం పలికారు. తమ వాడైన పవన్‌తో సినీ పెద్దలు ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఇండస్ట్రీ సమస్యలు పవన్‌కు తెలియనివి కాదు కాబట్టి.. తానూ ఒకప్పుడు బాధితుడినే కాబట్టి ఇక్కడి ఇబ్బందుల పట్ల సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీకి మేలు చేసే నిర్ణయాలు ఈ ప్రభుత్వంలో తీసుకునేలా చేస్తాడనడంలో సందేహం లేదు.