టీ-కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం.. జీవ‌న్ రెడ్డికి ఏమైంది?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది. సీనియ‌ర్ నాయ‌కుడు, గ‌తంలో పార్టీలో కీల‌క ప‌ద‌వులు కూడా చేసి, అధిష్టానం ద‌గ్గ‌ర మెప్పు పొందిన జీవ‌న్ రెడ్డి అలిగారు. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌గిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు అనుచ‌రులు చెబుతున్నారు. దీంతో అస‌లు పార్టీలో ఏమైంది? జ‌వ‌న్ రెడ్డి ఎందుకు అలిగారు? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌ను దెబ్బ‌కొట్టాల‌న్న ఉద్దేశంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను చేప‌ట్టింది. బీఆర్ ఎస్‌లో గెలిచిన వారిని ఒకరు త‌ర్వాత ఒక‌రుగా పార్టీలో చేర్చుకుం టున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందే.. దానం నాగేంద‌ర్‌ను చేర్చుకుని ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. తాజాగా పోచారం శ్రీనివాస‌రెడ్డితో పాటు ఆయ‌న కుమారుడిని కూడా చేర్చు కున్నారు.

ఈ క్ర‌మంలో జ‌గిత్యాల  నుంచి బీఆర్ ఎస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకుని.. జీవ‌న్ రెడ్డిని ఓడించిన సంజ‌య్‌ను కూడా సీఎం రేవంత్ పార్టీలోకి తీసుకున్నారు. ఇదే.. జీవ‌న్‌రెడ్డిని ఆగ్ర‌హానికి గురి చేసింది. క‌నీసం త‌న‌కు ఒక్క మాట కూడా చెప్ప‌కుండానే ఇలా ఎలా చేస్తారంటూ ఆయ‌న మండిప‌డుతున్నారు. త‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న సంజ‌య్‌ను కేంద్రంగా చేసుకుని జీవ‌న్ రెడ్డి ద‌శాబ్ద‌కాలంగా పోరాటాలు చేస్తున్నారు. ఇంత‌లోనే ఆయ‌న‌ను పార్టీలోకి చేర్చుకోవ‌డంతో జీవ‌న్ అల‌క‌పాన్పు ఎక్కారు.

ఈ విష‌యం తెలుసుకున్న కీల‌క నాయ‌కులు ఆయ‌న‌ను లైన్లో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. మేర‌కు జీవ‌న్ రెడ్డి లైన్‌లోకి వ‌స్తారో చూడాలి. త‌న ప‌ద‌వి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన జీవ‌న్ రెడ్డి పార్టీ మార్పు విష‌యంపైనా ఆలోచ‌న చేస్తున్నార‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. కానీ, ఇది జ‌ర‌గ‌దు. సుదీర్ఘ‌కాలంగా ఆయ‌న పార్టీతో అనుబంధం పెంచుకున్న నేప‌థ్యంలో కాంగ్రెస్‌లోనే ఉంటారు. కానీ, ఇప్పుడు రేవంత్‌కు మాత్రం కొన్ని చిక్కులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.