వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గత ఎన్నికలకు ముందు ప్రకటించారు. వారికి ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి తాను రూ.10 వేలకు పెంచుతానని కూడా చెప్పారు. అంతేకాదు.. అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు కూడా.. మారాలని ఆయన హితవు పలికారు. తాను వచ్చాక వలంటీర్లకు మెరుగైన నైపుణ్య శిక్షణ ఇప్పించి.. వారిని మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తానని హామీ ఇచ్చారు.
అయితే.. సర్కారు ఏర్పడి.. 20 రోజులు అయినా.. వలంటీర్ల ప్రస్తావన లేకుండా పోయింది. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అయినా.. దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ, వలంటీర్ల ప్రస్తావన లేకుండానే మంత్రి వర్గ భేటీ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.30 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు.. వైసీపీ నేతల ఒత్తిడితో 90 వేల మంది రాజీనామాలు చేశారు.
మిగిలిన 1.40 లక్షల వలంటీర్లు చంద్రబాబు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. పైగా.. మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇంటింటికీ పంపిస్తామని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు. దీంతో వలంటీర్లు .. తమను తీసుకుంటారని.. జూలై 1 నుంచి తమకు విధులు అప్పగిస్తారని ఆశగా ఎదురు చూశారు. కానీ, తాజ మంత్రి వర్గ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే.. పింఛను మాత్రం ఇంటింటికీ పంపిస్తామన్నారు.
కానీ, వలంటీర్లతో కాకుండా.. ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లోని.. సెక్రటరీలు, ఎడ్మిన్లను ఈ కార్యక్రమానికి వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటికిప్పుడు వలంటీర్లను నియమించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు స్పష్టమైంది. అయితే.. దీని వెనుక మరోసారి రిక్రూట్‌మెంట్ చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉంటే.. ఇప్పుడు దానిని 100 ఇళ్లకు పెంచే అవకాశం ఉంది. వేతనం పెంచుతున్నందున.. వలంటీర్ల సేవలను కూడా విస్తృతం చేయాలని నిర్ణయించే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో వారి విషయాన్ని ప్రస్తుతం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.