టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సింప్లిసిటీ బాగుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రి గా ప్రమాణం అనంతరం.. ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. దీనిని కొనసాగిస్తున్నారు కూడా. ఈ క్రమంలో సాధారణ ప్రజలకు కొంత వెసులుబాటు కూడా కల్పించారు. దీంతో అందరూ హ్యాపీగా వెళ్లి నారా లోకేష్‌ను కలుస్తున్నారు. తాజాగా సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్. తన కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దని తెలిపారు. ఈ క్రమంలో తన కుర్చీకి కట్టిన తెల్లటి టవల్‌ను స్వయంగా తీసేశారు. ఈ సింప్లిసిటీ బాగానే ఉంది. అయితే.. మున్ముందు కూడా దీనిని కొనసాగిస్తే బెటర్‌గానే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, వ్యక్తిగత కార్యాచరణలో ఉన్న సింప్లిసిటీ వ్యవహారాల్లోకి కూడా రావాల్సి ఉంటుంది. కొన్నాళ్ల కిందట చంద్రబాబు కూడా.. కూటమి పార్టీల సమావేశంలో తనకు వేసిన ప్రత్యేక కుర్చీని మార్చుకుని అందరితో సమానంగానే కూర్చున్నారు.
అంతేకాదు.. మంత్రులుకూడా సింప్లిసిటీ పాటించేలా చూడాల్సి ఉంది. సహజంగా ఉన్నతస్థానాల్లో ఉన్న నాయకులు ఎలా వ్యవహరిస్తారో.. కిందిస్థాయి వారు కూడా.. అలానే ముందుకు సాగుతారు కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన కొత్తకావడం.. ఎమ్మెల్యే అనంతరం మంత్రి కావడంతో నారా లోకేష్ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు కూడా.. దీనిని కొనసాగిస్తే.. ఖచ్చితం గా ఫీల్ గుడ్ మినిస్టర్ అనే పేరు రావడం ఖాయం.