ఎంత త‌ప్పు చేశావు జ‌గ‌న్‌.. పులివెందులే చెపుతోన్న ప‌చ్చి నిజం…?

జ‌గ‌న్ అభిమానులు.. వైసీపీ సానుభూతి ప‌రులు అంటున్న మాట ఇదే. ‘ఎంత త‌ప్పు చేశావు జ‌గ‌న్‌’ అనే అంటున్నారు. జ‌నాల‌ను న‌మ్ముకుని.. అన్నీ వారికి ఊడ్చి పెట్టి.. అప్పుల‌పై అప్పులు తెచ్చి ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. ఈ క్ర‌మంలో విపక్షాల నుంచి అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. సైకో అన్నా భ‌రించారు. తుగ్ల‌క్ అన్నా స‌హించారు. అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నార‌ని అన్నా.. ప‌ట్టించుకోకుండా.. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి నిధులు పంపిణీ చేశారు. ఫ‌లితంగా ఏం ద‌క్కింది? ఎన్నిక ల్లో ఘోర ఓట‌మి. ఒక‌నాడు ఠీవీగా ఎగిరిన జెండా.. ఇప్పుడు రెప‌రెప‌లు పోయి.. కొట్టుమిట్టాడే ప‌రిస్థితి.

“కొంతైనా ప్ర‌శాంత‌త ద‌క్కుతుంద‌ని ఆశించి ఇక్క‌డ‌కు వ‌స్తే.. ఇక్క‌డా త‌ల‌నొప్పేనా!” అని జ‌గ‌న్ అనుకునే ప‌రిస్థితి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే వ‌చ్చిందంటే.. జ‌గ‌న్ చేసింది త‌ప్పా? ఒప్పా? అనేది అర్థ‌మ‌వుతూనే ఉంది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు.. తాజాగా జ‌గ‌న్ దంప‌తుల‌ను చుట్టుముట్టారు. మాకు బిల్లులు చెల్లిస్తారా? లేదా? అని నిల‌దీశారు. దీంతో జ‌గ‌న్ దంప‌తులు సహ‌జంగానే ఉక్కిరిబిక్కిరికి గుర‌య్యారు. ఓట‌మి త‌ర్వాత‌.. ఎక్క‌డికీ వెళ్ల‌ని జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారు. ఆయ‌న ఉద్దేశం వేరు. కానీ, ఆయ‌న వ‌చ్చార‌ని తెలుసుకుని అప్పులోళ్లు ఎగ‌బ‌డ్డారు.

వీరిలో 5 లక్ష‌ల నుంచి 50 ల‌క్ష‌ల ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు ఉన్నారు. అంద‌రూ వైసీపీవారే. కానీ, ఏం ప్ర‌యోజ‌నం.. ఈగ‌లు ముసురుకున్న‌ట్టు ముసురుకున్నారు. “ఇప్పుడు ప‌రిస్థితి అంద‌రూ చూస్తూనే ఉన్నారు. కొంత మేర‌కు ఓపిక ప‌ట్టండి. మ‌నం అన్నీ సాధిద్దాం” అని నెత్తీనోరూ మొత్తుకున్నా.. జ‌గ‌న్ మాట వినిపించుకోలేదు. త‌మ‌కు సొమ్ములే కావాలంటూ యాగీ చేశారు. ఇవ‌న్నీ ఒక్క పులివెందుల‌తోనే పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇదంతా ఎందుకు జ‌రిగింది? అని ఆత్మ విమ‌ర్శ చేసుకుంటే.. ప‌థ‌కాల కార‌ణంగా.. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచేయ‌డ‌మే.

చేతికి ఎముక లేకుండా.. కీల‌క ప్రాజెక్టుల‌ను కూడా ఫ‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌కు సొమ్ములు చేర్చారు. వేల‌కు వేల కోట్ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాల రూపంలో అందించారు. పోనీ.. దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం ద‌క్కిందా? “మీ బిడ్డ‌ను మీరే కాపాడుకోవాలి” అని జ‌గ‌న్ నినాదాన్ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకున్నారా? అంటే.. తెలుస్తూనే ఉంది. ప‌ట్టించుకోక‌పోగా.. క‌నీసం గౌర‌వ ప్ర‌ద‌మైన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌కుండా చేశారు. మ‌రి ఈ ఐదేళ్ల‌లో ఢిల్లీ టు విజ‌య‌వాడ చేసిన ప్ర‌ద‌క్షిణ‌లు.. అప్పుల కోసం ప‌డిన పాట్లు ఏమైపోయాయి? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏదేమైనా జ‌గ‌న్ చేసింది త‌ప్ప‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.