బీసీకి సలాం- నువ్వుండు తమ్ముడు… తొందరపడకు !!

అధికారంలో ఉన్నప్పుడు జ‌రిగిన త‌ప్పుల‌ను స‌రిచేసుకునే ప‌నిలో ప‌డ్డారట టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో బీసీలు, ద‌ళితుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని, ముఖ్యంగా యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. నువ్వుండు త‌మ్ముడూ.. ముందు ముందు అంతా మీకే ప్రాధాన్యం. ఇప్పుడు తొంద‌ర‌ప‌డితే క‌ష్ట‌మే అంటూ.. కొంద‌రు పార్టీ మారేందుకు సిద్ధ‌ప‌డిన బీసీ నాయ‌కులకు ప్ర‌స్తుతం ఉన్న సీనియ‌ర్లు ఫోన్లు చేసి మ‌రీ చెబుతున్నార‌ని తెలిసింది. మొత్తానికి ఈ ప‌రిణామం.. పార్టీకి మేలు చేస్తుంద‌నే అనుకుంటున్నారు.

విష‌యంలోకివెళ్తే.. టీడీపీ పునాదులు మొత్తం బీసీ సామాజిక వ‌ర్గాల‌పైనే ఉన్నాయ‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతారు. రాష్ట్రంలో ఈ వ‌ర్గాల ఓటు బ్యాంకు భారీగా ఉండ‌డం.. పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ కూడా వీరికి ప్రాధాన్యం ఇచ్చిన నేప‌థ్యంలో ఆది నుంచి కూడా వీరికి పార్టీలో ప్ర‌ధాన స్థానం ఉంది. అదేస‌మ‌యంలో 1990ల‌లో ద‌ళితులు చంద్ర‌బాబు పాల‌న‌లో మంచి గుర్తింపు పొందారు. ప్ర‌తిభా భార‌తి వంటివారికి.. స్పీక‌ర్ ప‌ద‌వులు కూడా బాబు ఇచ్చారు. అయితే, పార్టీ ఉమ్మ‌డి రాష్ట్రంలో దాదాపు ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉంది. ఈ క్ర‌మంలో పార్టీ నిల‌బ‌డేందుకు.. తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు.. నిధులను బాబు సామాజిక వ‌ర్గం స‌ర్దుబాటు చేసింది.

దీంతో గ‌త ఐదేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, బీసీల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని కాదు. కానీ.. బాబు సామాజిక వ‌ర్గం దూకుడు ముందు వారు నిల‌బ‌డ‌లేక పోయారు. బాబు కూడా త‌న వ‌ర్గం నేత‌ల‌కే అప్పాయింట్‌మెంట్లు ఇవ్వ‌డం, వారి నిర్ణ‌యాల‌నే ప్రామాణికంగా తీసుకోవ‌డం వంటివి జ‌ర‌గ‌డంతో బీసీలు దూర‌మ‌య్యారు. ఇక‌, ద‌ళితులకు కూడా ప్రాధాన్యం త‌గ్గింది. ఈ ప‌రిణామ‌మే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పార్టీపై తీవ్ర‌ప్ర‌భావం చూపించింద‌ని భావించిన చంద్ర‌బాబు.. ఇటీవ‌ల జ‌రిగిన పోస్ట్‌మార్ట‌మ్‌లో బీసీలు, ద‌ళితుల‌కు తిరిగి ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ట‌.

అదేస‌మ‌యంలో యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని..త‌న కుమారుడు, భావి టీడీపీ అధినేత‌ లోకేష్‌ను బ‌లోపేతం చేయాలంటే.. యువ‌త ప్రాధాన్యం ఖ‌చ్చితంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే పార్టీ సీనియ‌ర్లు.. బీసీ యువ‌త‌ను, ద‌ళిత నేత‌ల‌నుకూడా పార్టీలో నుంచి జారి పోకుండా చూసుకుంటున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. గ‌త వైభ‌వం దిశ‌గా చంద్ర‌బాబు చేస్తున్న ఈ ప్ర‌యోగం.. ఫ‌లిస్తుందో లేదో చూడాల‌ని అంటున్న‌రు ప‌రిశీల‌కులు.