‘వికసిత్ భారత్ అనేది ప్రధాని నరేంద్ర మోదీ కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలి. రాష్ట్రాన్ని నిరుపేద రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేoదుకు అంతా కలసి కట్టుగా కృషి చేద్దాం. నాటి శాసనసభలో ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం నన్ను ఎంతో బాధించింది. అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా గౌరవంగా సభ నడుపుకుందాం. ప్రజలు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని గ్రహించి గౌరవ సభకు పంపారు. అందుకే వారి నమ్మకాన్ని కాపాడుతూ, ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత సభపై ఉంది. ప్రజలు ఇప్పటికే వైసీపీని శిక్షించారు. ఆ పార్టీని ఇక వెక్కిరించాల్సిన అవసరం మనకు లేదు’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికైన సంధర్బంగా ఆయన మాట్లాడారు.
అయ్యన్నపాత్రుడు పార్టీని కన్నతల్లిగా భావిస్తూ 43ఏళ్లుగా నిక్కచ్చిగా రాజకీయాలు చేస్తున్నారు. మచ్చలేని అయ్యన్నపాత్రుడిపై గత 5ఏళ్లలో అత్యాచారం సహా పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారు. అయినా దేనికీ భయపడకుండా ధైర్యంగా పోరాడి ప్రజల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చారు. గౌరవ శాసనసభను గత ప్రభుత్వం అగౌరవ పరిచింది. బూతులు తిట్టేందుకు, వ్యక్తిత్వ హననం చేసేందుకు, అవమానాలు, దాడులకు వేదికగా నాటి సభ నిలిచింది.తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎంతో అవమానించినా కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే మళ్లీ ముఖ్యమంత్రిగా గౌరవ సభకు వస్తానని శపథం చేసి బయటకు వెళ్లిపోయాను అని చంద్రబాబు అన్నారు.
2019ఎన్నికల ఫలితాలపై దేవుడి స్క్రిప్ట్ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏవేవో లెక్కలు చెప్పారని, కానీ ఈ ఎన్నికల్లో కూటమికి వచ్చిన సీట్లు 11 అని చంద్రబాబు ఒక లెక్క చెప్పారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 1631 రోజులు నడిచిందని. వాటిని సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడితే (1+6+3+1) 11 నంబర్ వస్తుందని అన్నారు. అలాగే జనసేన అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను నాడు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు. కానీ ఆయనతో సహా జనసేన పార్టీ సభ్యులు 21స్థానాల్లో పోటీ చేస్తే 21స్థానాల్లోనూ అభ్యర్థులు గెలిచి చూపించారని చంద్రబాబు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates