మంత్రులపై ఫిర్యాదులు..రెండు వైపులా దాడులు

ఇద్దరు మంత్రులపై రాష్ట్రంలోని వివిధ పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్మికశాఖలో అవినీతికి పాల్పడ్డారంటూ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ పైన, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశారు. ఇఎస్ఐ కుంభకోణంలో ఏ 14 నిందితుడైన కార్తీక్ దగ్గర నుండి మంత్రి కొడుకు ఈశ్వర్ బెంజి కారు బహుమానంగా తీసుకున్నట్లు టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రిపై అవినీతి నిరోధక శాఖ ఫిర్యాదులు స్వీకరించి వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ దాదాపు ఏడు జిల్లాల్లోని టిడిపి నేతలు తమ జిల్లాల్లోని ఏసిబి కార్యాలయాల్లో ఫిర్యాదులు చేశారు.

ఇదే అంశంపై మంత్రేమో టిడిపి నేతలపై మాటలతో ఎదురుదాడి చేస్తున్నారు. తమ కొడుకు అసలు కార్తీక్ దగ్గర నుండి ఎటువంటి బహుమానాలు అందుకోలేదన్నారు. కొత్త కారుకు రిబ్బన్ కత్తిరించమని కార్తీర్ కోరినందునే కారుముందు నిలబడి ఫొటోలు దిగినట్లు చెబుతున్నారు.

ఇక కోడాలి సంగతి తీసుకుంటే ఈయన వ్యవహారశైలే వేరు. చంద్రబాబునాయుడు, లోకేష్+టిడిపి నేతలపై మంత్రి మాటలు, కామెంట్లు చాలా దురుసుగా ఉంటాయి. నిజానికి కొడాలి మాటల హద్దులు మీరిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అనగానే మంత్రి ఒళ్ళుమరచిపోయి రెచ్చిపోతారనటంలో సందేహం లేదు. ఇటువంటి కొడాలి తాజాగా తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీవారి ఆలయంలో అన్యమతస్తుల దర్శనం సందర్భంగా ఇచ్చే డిక్లరేషన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అసలే మత రాజకీయాలపై దూకుడుగా వెళుతున్న బిజెపి నేతలకు కొడాలి వ్యాఖ్యలు బాగా అడ్వాంటేజ్ అయ్యాయి. విజయవాడలో వెండి సింహాలు పోవటం, కొన్ని విగ్రహాలకు చేతులు విరగటం తదితరాలపై కొడాలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానిపైనే బిజెపి అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు.

దాంతో వాళ్ళు రెచ్చిపోతు నానా గోల చేస్తున్నారు. వెంటనే మంత్రిపై యాక్షన్ తీసుకోవాలంటూ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడలోని మాచవరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు మంత్రులపై ప్రతిపక్షాల నేతలు ఫిర్యాదులు చేసేయగానే పోలీసులు యాక్షన్ తీసుకుంటారా ? తీసుకోరన్న విషయం అందరికీ తెలుసు. అయినా ఫిర్యాదులు ఎందుకు చేస్తున్నారంటే కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అని అర్ధం చేసుకోవాలి.