ప్ర‌క్షాళ‌న ప్రారంభం.. ఇక‌, జ‌గ‌న‌న్న‌ క‌నుమ‌రుగే!

ఏపీలో కొత్త‌గా ఏర్ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌క్షాళ‌న ప్రారంభించింది. గ‌త వైసీపీ స‌ర్కారు ఆన‌వాళ్ల‌ను దాదాపు చెరిపేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. దీనిలో భాగంగా.. అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల నుంచి జ‌గ‌న్ ఫొటోల‌ను తొల‌గించాలని సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ అధికారులు ఉత్త‌ర్వులు జారీచేశారు.

అదేవిధంగా ఎలక్షన్ కోడ్ సమయంలో సచివాలయాలకు ఇచ్చిన హై సెక్యూరిటీ పేపర్లను మాత్రమే ప్రస్తుతం ఉపయోగించాలని పేర్కొన్నారు. హై సెక్యూరిటీ పేపర్ పై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఫోటో ఉన్న సర్టిఫికెట్స్‌ మాత్రమే గ్రామ వార్డు సచివాలయాల‌కు ఇవ్వాల‌ని పేర్కొన్నారు.

2019 మే నెలకి ముందు ప్రారంభం అయ్యి, 2019 – 2024 మధ్య కొనసాగించిన ప్రభుత్వ పథకాల పేర్లు గ‌తంలో 2014-19 మ‌ధ్య ఎలా ఉన్నాయో అలానే వాటిని మార్పు చేయాల‌ని పేర్కొన్నారు.

అలాగే 2019-24 మధ్యలో ప్రారంభమైన కొత్త పథకాల పేర్లను వెంటనే తొలగించి, కొత్తగా పేర్లు పెట్టే వరకు వాటికి సాధారణ పేరును మాత్రమే ఉపయోగించాల‌ని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఇక‌, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లో పార్టీ జెండా రంగులను తీసేయాల‌ని తెలిపారు. రైతుల‌ పాస్ పుస్తకాలపై, లబ్ధిదారుల కార్డుల పై, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడిన సర్టిఫికెట్లపై పార్టీ జెండాలకు సంబంధించిన రంగులు ఉన్నట్టయితే వాటిని వెంటనే నిలుపుదల చేయాల‌ని ఆదేశాల్లో తెలిపారు.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, వైఎస్సార్ భ‌రోసా, జ‌గ‌న‌న్న ఇళ్లు, ఇలా.. జ‌గ‌న‌న్న పేరుతో కొన‌సాగిన అనేక ప‌థ‌కాల పేర్ల‌లో జ‌గ‌న‌న్న పేరు పూర్తిగా క‌నుమ‌రుగు కానుంది. అదేవిధంగా జ‌గ‌న్ ఫొటోల‌ను కూడాతొల‌గించ‌నున్నారు.

ముఖ్యంగా రైతుల‌కు ఇచ్చిన పాసు పుస్త‌కాల‌పై జ‌గ‌న్ ఫొటోలు వేయ‌డం.. ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. అలానే.. దివ్యాంగులు, వృద్ధుల‌కు పంపిణీ చేసిన సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌కు సంబంధించిన పుస్త‌కాల‌పైనా జ‌గ‌న్ బొమ్మ‌లు చేశారు. ఇప్పుడు అవ‌న్నీ నిలిచిపోయి.. జ‌గ‌న‌న్న పేరును తీసేయ‌నున్నారు.