దక్షిణాదివారంటే ఉత్తరాది వారికి చులకన భావమన్న వాదన దక్షిణాది ప్రజలతోపాటు రాజకీయ నేతల్లోనూ చాలాకాలంగా ఉంది. హిందీ భాష విషయంలో ఉత్తరాది వారి డామినేషన్ ను తమిళ తంబీలు గట్టిగా ప్రశ్నించిన సందర్భాలు అనేకం. ఇటీవలి కాలంలో మాకు హిందీ తెలియదంటూ తమిళులు పెడుతున్న పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ఉత్తరాది డామినేషన్ పై చలనం వచ్చింది. ఉత్తరాది ఆధిపత్యంపై కన్నడ ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తరాది ఆధిపత్య ధోరణిపై కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 12 వేల సంవత్సరాల భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీలో ఒక్కరు కూడా దక్షిణాదికి చెందిన వారు లేకపోవడాన్ని కుమార స్వామి విమర్శించారు.
12 వేల సంవత్సరాల భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడానికి 16 మంది నిపుణులతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఆ కమిటీలో ఒక్కరంటే ఒక్కరు కూడా ద్రవిడ సంస్కృతి తెలిసిన దక్షిణాదివారు, కన్నడవారు కానీ లేరు. ఆ కమిటీలో దక్షిణాదికి ప్రాధాన్యత లేకపోవడంపై కుమార స్వామి అసహనం వ్యక్తం చేశారు.
ఇది చాలా బాధాకరమన్న కుమార స్వామి….ఆ కమిటీలో కనీసం ఒక్క మహిళకూ చోటు దక్కలేదన్నారు. దక్షిణాదికి చోటు లేకుండా ‘సంపూర్ణ భారతీయ సంస్కృతి’పై అధ్యయనం చేయడం ఏమిటని కుమార స్వామి ప్రశ్నించారు. సంపూర్ణ భారతీయ సంస్కృతి
అంటూ దక్షిణాదికి చోటివ్వకపోవడంపై కుమార స్వామి అడిగిన లాజిక్ కు కేంద్రం , ఉత్తరాది నేతలు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.