ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఎప్పుడు ఏక్షణంలో ఎవరు పార్టీని వీడుతారో అనే భయం పార్టీ నేతలను వెంటాడుతోంది. గెలిచిన వారిలోనూ ఒకరిద్దరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన పార్టీలో ఉండడం అనుమానంగానే ఉంది. విరూపాక్షి ఇప్పటికే టీడీపీ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే.. ఆయన దీనిని ఖండించారు. తనకు సీటు ఇచ్చి.. గెలిపించిన జగన్‌ను వదలబోనన్నారు. అంతేకాదు..తాను ఒక్కడినే అయినా అసెంబ్లీలో పోరాటం చేస్తానని చెప్పారు.
కానీ, ఇలా అన్న ఏ నాయకుడూ.. కూడా ఆ మాటను నిలబెట్టుకున్న పరిస్థితి రాజకీయాల్లో లేక పోవడంతో వైసీపీ నాయకులు కూడా విరూపాక్షిపై ఆశలు వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక, తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత శిద్దా రాఘవరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో తాను పార్టీని వీడుతున్నట్టు శిద్దా ప్రకటించారు. ఈయన 2014-19 మధ్య టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. 2019లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత.. టీడీపీకి గుడ్ బై చెప్పారు.
ఈ క్రమంలోనే వైసీపీలో చేరారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ అంటూ.. జగన్ ఆయనకు ఆశలు పెట్టారని శిద్దా వర్గం.. ఆరు మాసాల కిందట నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. ఇక, తాజా ఎన్నికల్లో టికెట్ అయినా ఇస్తారని శిద్దా ఆశలు పెట్టుకున్నారు. వైశ్య సామాజికవర్గం కోటాలో గిద్దలూరు దక్కుతుందని ఆశించారు. కానీ, జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో తన పాత పార్టీ టీడీపీవైపు ఎన్నికలకు ముందే దృష్టి సారించారు.
కానీ, అప్పటికే దర్శి టికెట్ గొట్టిపాటి లక్ష్మికి కేటాయించడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఇక, ఇప్పుడు సమీప రోజుల్లో వైసీపీకి భవిష్యత్తు ఉండదని నిర్ధారించుకున్న శిద్దా రాఘవరావు.. పార్టీకి రాజీనామా చేశారు. ఈయన త్వరలోనే టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంది. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసే శిద్దా రాఘవరావుకు చంద్రబాబు ఆహ్వానంపలికే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తే.. వైసీపీ నుంచి రాబోయే రోజుల్లో ఇంకెంత మంది బయటకు వస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates