రాధాకు బాబు గిఫ్ట్ అదే!

టీడీపీని న‌మ్ముకుని, అధినేత చంద్ర‌బాబు నాయుడుపై అభిమానంతో ఎలాంటి ప‌ద‌వులు లేక‌పోయినా, టికెట్ రాక‌పోయినా పార్టీలో కొన‌సాగిన వంగ‌వీటి రాధా క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్క‌బోతోంద‌ని తెలిసింది. రాధాకు బాబు గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆయ‌న్ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపేందుకు బాబు క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని తెలిసింది. ఎమ్మెల్సీగా తొలి జాబితాలోనే రాధా పేరును చంద్ర‌బాబు ఫైన‌ల్ చేయ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో పార్టీ కూట‌మి విజ‌యం కోసం తీవ్రంగా శ్ర‌మించిన రాధాకు బాబు ప్ర‌యారిటీ ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది.

వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ టికెట్ ద‌క్క‌క‌పోయినా రాధా టీడీపీలోనే ఉన్నారు. పోటీ చేయాల‌ని అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి వచ్చినా రాధా విన‌యంగానే ఉండిపోయారు. 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత 2009లో ప్ర‌జారాజ్యం పార్టీలో చేరి ఓడిపోయారు. 2014లోనూ వైసీపీ త‌ర‌పున పోటి చేసినా గెలుపు ద‌క్క‌లేదు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి వెళ్లారు. అప్పుడు రాధాకు బాబు టికెట్ ఇవ్వ‌లేదు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచింది. ఆ పార్టీలో కొన‌సాగి ఉంటే రాధా ఎమ్మెల్యేగా గెలిచేవార‌ని లేదా ఎమ్మెల్సీ ప‌ద‌వి అయినా ద‌క్కేద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

కానీ టీడీపీలోనే రాధా కొన‌సాగారు. 2024 ఎన్నిక‌ల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాల‌ని అనుచ‌రులు, కార్యక‌ర్త‌లు రాధాపై ఒత్తిడి తెచ్చారు. ఇక త‌న స్నేహితులైన వైసీపీ నేత‌లు కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ తిరిగి త‌మ పార్టీలోకి రావాల‌ని రాధాను ఆహ్వానించారు. కానీ బాబు టికెట్ ఇవ్వ‌క‌పోయినా రాధా టీడీపీలోనే ఉండిపోయారు. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి విజ‌యం క‌ష్ట‌ప‌డ్డారు. పార్టీ మంచి ఫ‌లితాలు సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. దీంతో ఆయ‌న్ని ఎమ్మెల్సీగా చేయాల‌ని బాబు చూస్తున్న‌ట్లు తెలిసింది. ఎమ్మెల్సీగా రాధా ఎంపిక‌పై ఎవ‌రికి అభ్యంత‌రాలు కూడా ఉండే అవ‌కాశం లేద‌నే చెప్పాలి.