ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్ని వర్గాల ప్రజలు అమిత ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఎవరి ఆశలు ఎలా ఉన్నాయి? చంద్రబాబు విషయంలో ఎవరు ఎలా ఆలోచన చేస్తున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. మధ్య తరగతి నుంచి మిలియనీర్ల వరకు.. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు చంద్రబాబుపై కోటి ఆశలే పెట్టుకున్నారు ముఖ్యం గా మూడు వర్గాల ప్రజలను గమనిస్తే.. ఆశలు, ఆశయాల్లో స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మధ్యతరగతి ప్రజలు కొన్ని ఆశలతో ఉంటే.. సామాన్యుల ఆశలు వేరేగా ఉన్నాయి. వీటికి భిన్నంగా ఉన్నతస్థాయి వర్గాల ఆశలు కూడా కనిపిస్తున్నాయి.
సామాన్యుల విషయం చూస్తే.. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన ఉచిత పథకాలపై వారు కొండంత ఆశలు పెట్టుకున్నారు. సామాజిక భద్రతా పింఛను పెంపుదల ప్రదానంగా వారిని ఉత్కంఠకు గురి చేసింది. అయితే..దీనిపై చంద్రబాబు సానుకూలంగానే స్పందించారు.ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకాల పరంపరలో దీనిని కూడా చేర్చారు. సంతకం చేశారు. ఇక, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఏటా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్నిక లసమయంలో వాగ్దానం చేశారు. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంది. ఈ రెండుతో పాటు మహిళల్లో 18 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని చంద్రబాబు చెప్పారు. ఇది కొంత ఇబ్బందిగా మారనుంది. ఎందుకంటే.. వీరి సంఖ్య 70 లక్షల వరకు ఉంటుందని తాజాగా అంచనా వేశారు.
మధ్యతరగతి వర్గాలను పరిశీలిస్తే..ప్రధానంగా పెట్రోలు ధరలు సహా నిత్యావసారల ధరల తగ్గింపును కోరుకుంటున్నారు. అయితే.. దీనికి చంద్రబాబు హామీ ఇవ్వలేదు. కానీ, ధరలను పెంచబోమని మాత్రం అన్నారు. ఈ నేపథ్యంలో వీరు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అదేసమయంలో రహదారుల బాగుచేత, ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పనల విషయంలో మధ్యతరగతి ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అలానే.. చెత్తపన్ను ఎత్తివేత, ఇంటి పన్నుల తగ్గింపు వంటివి కూడా కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఇక, కీలకమైన.. అభివృద్ధి విషయంలోనూ మధ్యతరగతి చంద్రబాబుపై ఆశలు భారీగానే పెట్టుకుంది. ఇవి చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు.
ఇక, అసామాన్యులు, మిలియనీర్ల విషయానికివస్తే.. చంద్రబాబుపై వీరి ఆశలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. కేంద్రంలో అధికారం పంచుకున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా తెస్తారని.. వీరు ఆశలు పెట్టుకున్నారు. తద్వారా రాయితీలు పొంది పరిశ్రమలు , ప్రాజెక్టులు పెట్టుకోవచ్చన్న ఆశలు ఉన్నాయి. ఇక, అమరావతి రాజధానిని వడివడిగా పూర్తి చేస్తే.. తమకు పెట్టుబడులు పెట్టేందుకు మరింత అవకాశం చిక్కుతుందని భావిస్తున్నారు. అయితే.. ఈరెండింటిలోనూ.. ప్రత్యేక హోదా విషయం మాత్రం సాకారం అవుతుందా? అనేది చిక్కు ప్రశ్న. అమరావతి విషయానికి వస్తే మాత్రం మూడేళ్ల పాటు వేచి చూడాలి. సో.. ఇలా .. ఒక్కొక్క వర్గం ఆశలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. మరి చంద్రబాబు ఇంత మందిని శాటిస్ఫై చేస్తారా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates