నేతలు ఎక్కువైపోవటం వల్లే గొడవలు పెరిగిపోతున్నాయా ?

జిల్లాలో నేతల వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది.మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లను వైసిపినే గెలుచుకుంది. అలాగే నెల్లూరు ఎంపి సీటులో కూడా వైసిపినే జెండా ఎగరేసింది. గెలిచిన వాళ్ళలో అత్యధికులు హెవీ వెయిట్సే ఉండటంతో పార్టీలో సమన్వయం కొరవడిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

ఇదే సమయంలో ఒకళ్ళు చెబితే మరోకళ్ళు వినే పరిస్ధితి కూడా కనిపించటం లేదు. దాంతో జిల్లాలో నేతల పరిస్ధితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతోంది. ఇందుకనే ఈ జిల్లా నేతలపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తాజాగా నేతలు చెప్పుకుంటున్నారు.

మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వారిలో కోటంరెడ్డి శ్రీధరెడ్డి, అనీల్ కుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డి,మేకపాటి గౌతమ్ రెడ్డి లాంటి గట్టి నేతలున్నారు. ఇక ఎంపిగా గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా తక్కువ వాడేమీ కాదు. ఇలా చాలా నియోజకవర్గాల్లో పార్టీకి వీర విధేయులు, జగన్ కు అత్యంత సన్నిహితులే గెలవటం కూడా పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు జగన్ ప్రత్యేకించి మంత్రి గౌతమ్ కు బాధ్యతలు అప్పగించారట. అందుకనే మంత్రి కూడా నేతలందరితో భేటి అవుతున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు.

విచిత్రమేమంటే ఎన్నికల వరకు నేతలందరు ఏకతాటిపై నిలబడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. దానికితోడు చాలామంది సీనియర్లను కాదని జూనియర్ అయిన గౌతమ్ కు మంత్రివర్గంలోకి తీసుకోవటంతో కొందరు సీనియర్లు భగ్గుమంటున్నారు. అనీల్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటంలో ఎవరికీ ఆక్షేపణ కనిపించటం లేదు. ఎందుకంటే మొదటినుండి అనీల్ పార్టీలోనే ఉండటమే కాకుండా జగన్ కు వీర విధేయునిగా ముద్రపడ్డారు. సమస్యంతా గౌతమ్ విషయంలోనే.

మంత్రులిద్దరి విషయానికి వస్తే అనీల్ బాడీ ల్యాంగ్వేజ్ చాలా రఫ్ గా ఉంటుంది. ఎవరితో అయినా సరే ఢీ అంటే ఢీ అనే పద్దతిలో మాట్లాడుతారు. ఇదే సమయంలో గౌతమ్ సాఫ్ట్ గా కనిపిస్తారు. పైగా తండ్రి, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దాంతో సీనియర్లలో ఎక్కువమంది అనీల్ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆమధ్య ప్రభుత్వంపై వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. ఆనం కోపమంతా అనీల్ ను ఉద్దేశించే అని చెప్పుకుంటున్నారు. అందుకనే జగన్ కూడా నేతలను సమన్వయం చేసే బాధ్యతను గౌతమ్ కు అప్పగించారు. మంత్రి కూడా తన బాధ్యతలను ఆచరణలోకి తెస్తున్నారు. మరి నేతల మధ్య సమన్వయం ఎంతవరకు సాధ్యమో చూడాల్సిందే.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)