కలిశెట్టి అప్పలనాయుడు. ఈ పేరుకు ఇప్పుడు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీడీపీలో సాధారణ కార్యకర్త అయిన అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీగా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు.
అనేకమంది అభ్యంతరాలు చెప్పినా తాను పట్టించుకోలేదని స్వయంగా వెల్లడించిన చంద్రబాబు ఫలితాల తర్వాత జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ‘ఏం అప్పలనాయుడు ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నావా ? లేదంటే చెప్పు మనవాళ్లు బుక్ చేస్తారు’ అంటూ అప్పలనాయుడును ఆరాతీయడంతో ఆయన బాబు వాత్సల్యానికి చలించిపోయిన విషయం తెలిసిందే.
అయితే గెలిచిన ఎంపీలంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే ఎంపీ అప్పలనాయుడు మాత్రం అప్పుడే డ్యూటీ ఎక్కేశాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మెట్టవలసలోని ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్‌ను గురువారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులు, గ్రామస్థులతో ముచ్చటించి విద్యా బోధన, హాస్టల్లోని వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో కలిసి రాత్రికి హాస్టల్లోనే నిద్రించాడు.
ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, తన వంతుగా హస్టల్ కు కావాల్సిన ఫ్యాన్లను, మరి కొన్ని సదుపాయాలను సమకూర్చాడు. అన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని కాకుండా స్థానికులు సైతం కొంత చొరవ చూపి హాస్టల్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని విన్నవించారు.
మెట్టవలసలోని ఇదే హాస్టల్ లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అప్పలనాయుడు చదువుకోవడం విశేషం. తాను గతంలో చదువుకున్న హాస్టల్‌ను సందర్శించి అక్కడి అవసరాల్ని తీర్చే ప్రయత్నం చేయడం అభినందనీయం.ఇలా ఎంపీ అయ్యాడో లేదో అప్పుడే ఆకస్మిక తనిఖీలు, రాత్రి నిద్రలు చేయటంపై ప్రజల నుండి ప్రశంసలు వస్తున్నాయి.