ఏపీ సీఎం చంద్రబాబు పని ప్రారంభించేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే చంద్రబాబు తన తీరును ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి రాజధానిలోని సచివాలయంలోనే తాను అందుబాటులో ఉంటానని తేల్చిచెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాను సచివాలయంలోనే ఉండనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమయంలో ఎవరు వచ్చినా.. తనను కలుసుకోవచ్చారు.
ఇక, ఇదే సమయంలో 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించే క్రమంలో ప్రతి సోమవారం సదరు ప్రాజెక్టు ప్రాంతం వద్దకు వెళ్లి పరిశీలించి..సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసేవారు.
తద్వారా.. పనులు వేగంగా పూర్తి కావడంతోపాటు.. పనుల్లో నాణ్యత కూడా ఉంటుందని.. రాజీ ధోరణి ప్రదర్శించరని చంద్రబాబు చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే పంథాలోనే చంద్రబాబు పయనిస్తున్నారు. సోమవారం నుంచి ఆయన పోలవరం పేరుతో ప్రాజెక్టు సైట్‌కు వెళ్లనున్నారు.
అంతేకాదు… పోలవరం పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో రాజీ ధోరణి లేదని కూడా ఉన్నతాధికారులకు ఆయన తేల్చి చెప్పారు. ఇక, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించ వద్దని చంద్రబాబు సూచించారు. గతంలో ఏం చేసినా.. ఎలా జరిగినా.. ఇప్పుడు మాత్రం పూర్తి పారదర్శకతతో ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు.
మంత్రుల విషయంలో చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. మంత్రులు ప్రతి ఒక్కరు తమ తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారు. అదేవిధంగా సమయ పాలనను ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ డైరీ మెయింటెన్ చేసుకోవాలని.. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సమయం ప్రకారం.. పరిష్కరించాలన్నారు. ముందుగా నియోజకవర్గాలు, జిల్లాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates