జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ ప్రభుత్వం నుంచి మరో గౌరవం లభించింది. కూటమి పార్టీల్లో ఆయనకు ఎనలేని గౌరవం ఇస్తున్న విషయం తెలిసిందే. పైన ఉన్న కేంద్రం పెద్దల నుంచి రాష్ట్ర స్థాయి వరకు దిగ్గజ నాయకులు, పార్టీల నుంచి కూడా గౌరవం లభిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీలో బీజేపీని గెలిపించడంతోపాటు.. కూటమి సర్కారును ఆయన అధికారంలోకి తీసుకువచ్చారు. దీంతో ప్రతి ఒక్కరిలోనూ పవన్ పేరు వినిపిస్తోంది.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సైతం.. పవన్ ఇమేజ్‌కు ఎలాంటి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన కోరకుండా.. ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. ఆయన కోరకుండానే.. ఇష్టమైన గ్రామీణ అభివృద్ధి శాఖను అప్పగించారు. ఒకరకంగా చెప్పాలంటే.. గ్రామీణ పాలన అంతా.. పవన్‌కు ఇచ్చేసినట్టే. ఇక, సచివాలయంలో ప్రత్యేకంగా పవన్ కోసం.. పెద్ద ఛాంబర్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. పవన్ అభిరుచులకు అనుగుణంగా.. దీనిని తీర్చి దిద్దుతున్నారు.
అదేసమయంలో కొత్త కాన్వాయ్‌ను కూడా పవన్ కల్యాణ్ కోసం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్య్యాలయం నుంచి ఉన్నతాదికారి కార్యాలయం వరకు కూడా.. ప్రతి కార్యాలయంలోనూ సీఎం చంద్రబాబు చిత్రపటం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలని తాజాగా సర్కారు ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలు సహా.. ప్రతి చోటా ఈ రెండు చిత్రపటాలు ఉండి తీరాల్సిందేనని పేర్కొంది.
నిజానికి ఇప్పటివరకు ఇలాంటి విధానం లేదు. కేవలం ప్రభుత్వ కార్యాలయంలో సీఎం చిత్రపటం మాత్రే ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలను ఏర్పాటు చేస్తారు. కానీ, రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు.. పవన్‌కు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుని పవన్ కు మరో గౌరవం కట్టబెట్టిందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates