ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గం కూడా కొలువుదీరింది. 24 మందితో బాబు కేబినెట్ సిద్ధమైంది. అయితే ఈ మంత్రివర్గ కూర్పు వెనకాల టీడీపీ, లోకేశ్ ఫ్యూచర్ కోసం ఆలోచించి బాబు నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ 24 మందిలో 17 కొత్తవాళ్లే ఉండటమే అందుకు రుజువని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి పదవుల కోసం సీనియర్లు పట్టుబట్టినా నిర్మొహమాటంగా బాబు నో చెప్పారని తెలిసింది.
కేబినెట్‌లో పాత నాయకులు అంటే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, ఎన్ఎండీ ఫరూక్, పయ్యావుల కేశవ్ లాంటి వాళ్లు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్లలో పార్టీ పరంగా సినియారిటీ ఉన్నా మంత్రి పదవులు మాత్రం కొత్త.
భవిష్యత్‌లో పార్టీని పరుగులు పెట్టించాలంటే యువత మంత్రివర్గంలో ఉండాలని బాబు భావించారని తెలిసింది. మరోవైపు టీడీపీలో నంబర్ 2 నాయకుడు ఎవరంటే నిస్సందేహంగా లోకేశ్ పేరే వినిపిస్తోందనే టాక్ ఉంది. టీడీపీ ఫ్యూచర్ లీడర్‌గా ఆయన్ని చూస్తున్నారు. అందుకే లోకేశ్‌కు అనుగుణంగా మంత్రివర్గాన్ని బాబు డిసైడ్ చేశారని తెలిసింది.
లోకేశ్ యువగళం పాదయాత్రతో తిరిగి రాష్ట్రంలో టీడీపీకి ఆదరణ దక్కడంలో తన వంతు పాత్ర పోషించారు. ఈ పాదయాత్ర సందర్భంగా తనకు, పార్టీకి అండగా నిలిచిన వాళ్లను లోకేశ్ మర్చిపోలేదు. కష్టపడి ఈ యాత్రను సక్సెస్ చేసిన వాళ్లకు మంత్రి పదవులు దక్కడంలో లోకేశ్ కీలకంగా వ్యవహరించారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇందుకోసం బాబు తనకు నమ్మకస్థులనూ దూరం పెట్టేందుకు వెనుకాడలేదు. ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య లాంటి వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అసంతృప్తి వెళ్లగక్కే అవకాశం కూడా ఈ నాయకులకు లేదనే చెప్పాలి. ఎన్నికల్లో పార్టీ గొప్ప విజయం సాధించింది. అందుకే బాబు బయటి విషయాలను పట్టించుకోకుండా తాను అనుకున్నదే చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.