టీడీపీ అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకు గత ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారు.. నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. 56 సామాజిక వర్గాల కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలోనూ మళ్లీ ఉప పదవులు ఉన్నాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగానే.. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లను, వైస్ చైర్మన్లను కూడా.. రాజీనామాలు చేయించారు. దీంతో 56 + ఇతర పదవుల కోసం తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. జిల్లాల స్థాయిలో మంత్రులకు ఇప్పటికే వారు అర్జీలు కూడా సమర్పించుకున్నారు.
ఇక, రాష్ట్రంలో 12 కీలకమైన దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో తిరుమల, విజయవాడ కనకదుర్గ, అన్నవరం సత్యనారాయణ స్వామి, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకాళహస్తి, కాణిపాకం వినాయ స్వామి, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామి, కడప ఒంటిమిట్ట రామాలయం, శ్రీశైలం దేవస్థానం.. ఇలా.. కీలకమైన దేవాలయాలకు బోర్డులు ఉన్నాయి. వాటి పాలక మండళ్లకు కూడా.. ఇటీవల రాజీనామాలు చేయించారు. కొందరు స్వచ్ఛందంగానే రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో ఆయా పదవులకు కూడా.. తమ్ముళ్లు క్యూకట్టారు. తామంటే తామేనని ఆయా జిల్లాల పరిధిలో తమ్ముళ్లు ఒకరికి నలుగురు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇదే సమయంలో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్లకు కూడా డిమాండ్ పెరిగింది. వీటికి కీలక నాయకులను నియమించే అవకాశం ఉండడంతో వారు కూడా.. తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకున్నారు. వీరంతా కూడా.. పార్టీలో కీలక నాయకులే కావడం గమనార్హం.
ఇక, వక్ఫ్ బోర్డు కీలకమైన వ్యవహారంగా మారింది. ఈ సారి విజయవాడకు చెందిన జలీల్ ఖాన్‌కు అవకా శం దక్కుతుందని అనుకున్నా.. గుంటూరుకు చెందిన వారికి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
మరో వైపు.. ఇప్పట్లో ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం లేక పోవడంతో నేతలంతా నామినేటెడ్ పదవుల పైనే దృష్టి పెట్టినట్టు సమాచారం. మరి పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక నెలలోనే వీటిని కూడా భర్తీ చేయడం ఖాయం. మరి ఈ పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates