ర‌ద్ద‌న్న‌దే ముద్ద‌యింది కదా జ‌గ‌న్!

జ‌గ‌న్‌.. అంటే ఏంటి? అని ఇటీవ‌ల జాతీయ రాజ‌కీయ నాయ‌కుడిని ప్ర‌శ్నిస్తే.. ‘అర్ధంకాని పేజీ’ అని బ‌దులిచ్చారు. నిజ‌మేన‌ని అనిపిస్తుంది. ఎందుకంటే.. తాను తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయ‌న ఒక్క‌సారి అద్దం ముందు నిల‌బ‌డి ‘ఇవి స‌రైన‌వేనా?’ అని ఆలోచించుకుంటే.. ఆయ‌న‌కే త‌త్వం బోధ‌ప‌డుతుంది. ఒక్క‌సారి ఇచ్చిన ఛాన్స్‌ను ఒబ్బిడిగా వినియోగించుకుని ..ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాల్సిన ముఖ్యమంత్రి .. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్‌తోనే ప‌రిమితం కానున్నార‌నే కామెంట్లు మొద‌ల‌య్యారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. తాను ఒక‌ప్పుడు ర‌ద్దు చేసేస్తా.. రంగు తీసేస్తా.. అంటూ.. అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున జ‌గ‌న్ వ్యాఖ్యానించిన శాస‌న మండ‌లి.. ఇప్పుడు ఆయ‌న‌కు ఆద‌ర‌వుగా నిలిచింది. మూడు రాజ ధాని బిల్లు విష‌యంలో త‌లెత్తిన వివాదం కార‌ణంగా.. జ‌గ‌న్ అప్ప‌ట్లో మండ‌లిని ర‌ద్దు చేస్తూ.. నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసింది. దీనిని కేంద్రానికి కూడా హుటాహుటిన పంపేశారు. కానీ, కేంద్రంలోని పెద్ద‌లు ఢ‌క్కాముక్కీలు తిన్న వారు కావ‌డంతో జ‌గ‌న్ పిల్ల చేష్ఠ‌ల‌ను ప‌క్క‌న పెట్టారు.

దీంతో మండ‌లి ర‌ద్దు కాలేదు. పైగా.. రెండేళ్లు తిరిగే స‌రికి.. అదే మండ‌లిలో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు క‌ళ‌క‌ళలాడుతున్నారు. మొత్తం 35 మంది ఎమ్మెల్సీలు.. మండ‌లిలో వైసీపీ నాయ‌కులే ఉన్నారు. ఇప్పుడు .. అధికారం కోల్పోయి,. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోలేక నిలువునా విల‌పిస్తున్న వైసీపీకి.. ప్రాణం పోసింది ఏదైనా ఉందంటే.. అది ఒక్క మండ‌లి మాత్ర‌మే. ఎందుకంటే.. వైసీపీకి ఇప్పుడు వాయిస్ వినిపించే స‌త్తా.. వంటివి కేవ‌లం మండ‌లిలోనే ఉన్నాయి.

పైగా మండ‌లి ఇప్పుడు వైసీపీ స్వాధీనంలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన మోషేన్ రాజు మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్నారు. దీంతో టీడీపీ ప్ర‌భుత్వం ఎంత బ‌లంగా ఉన్నా.. మండ‌లికి వ‌చ్చే స‌రికి మాత్రం వైసీపీ దే పైచేయి.. మ‌రో రెండున్న ర సంవ‌త్స‌రాల వ‌ర‌కు వైసీపీనే హ‌వా చ‌లాయిస్తుంది. ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. అప్ప‌ట్లో రాజ‌ధాని అమ‌రావతిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే.. మండ‌లిని కూడా ప‌క్క‌న పెట్టేసి ఉంటే.. జ‌గ‌న్‌కు ఇప్పుడు చెప్పుకొనేందుకు వేదిక కూడా దొరికేది కాదు. బ‌హుశ అందుకేనేమో.. జాతీయ నాయ‌కులు అర్ధం కాని పేజీ అంటూ.. జ‌గ‌న్ పై స‌టైర్లు వేసింది!!