తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవి చూసింది. ఒక దశాబ్దం వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయం ఆ పార్టీలోని కీలక నాయకులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. అయితే.. పైకి మాత్రం అందరూ గుంభనంగా ఉంటున్నారు. కానీ, ఒకరిద్దరు మాత్రం ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. వీరిలో కీలక నాయకుడు, నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన.. మాజీ మంత్రి అనిల్ కుమార్.. ఒకరు. ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఓడిపోవడానికి కొందరు నేతలు చేసిన దూల వ్యాఖ్యలే కారణమంటూ.. సోషల్ మీడియాలో జరుగు తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఔను. నిజమై ఉండొచ్చు. మా నోటి దూలే ఓడించిందని నాకు కూడా కొందరు చెప్పారు. ఇదినిజమైతే.. మా నోటిని మేం కంట్రోల్ చేసుకుంటాం
అని అనిల్‌కుమార్ యాదవ్ స్పందించారు. ఇక, తాను ఎన్నికలకు ముందు చేసిన శపథంపై ఆయన స్పందించారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
ఇదే విషయంపై అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నిజమే. నేను ఆ శపథం చేశాను. ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. కానీ, అప్పట్లో ఈ శపథాన్ని ఎవరూ స్వీకరించలేదు. ఓకే నువ్వు అలా నే చెయ్యి.. మేం ఓడిపోతే కూడా ఇలానే చేస్తాం.. అని ఎవరైనా అని ఉంటే.. తప్పకుండా ఇప్పుడు నేను రాజకీయాలను వదిలేస్తా. కానీ, ఎవరూ నేను చేసిన శపథాన్నిస్వీకరించలేదు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్నే రాదు. అయినా.. ఎవరి కోసం రాజకీయాలు వదిలేయాలి
అని అనిల్ ప్రశ్నించారు.
ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయని అనిల్ చెప్పారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగిందన్నారు. ప్రస్తుతం తాము వినే పరిస్థితిలో ఉన్నామని,, టీడీపీ నాయకులు చెప్పే పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. కాలం గిర్రున తిరుగుతుందని.. పరిస్థితులు మారతాయని అన్నారు. ఈ ఐదేళ్లు తాము ప్రజల వెంటే ఉంటామని.. ఎక్కడి పారిపోబోమని అనిల్ తెలిపారు. అయితే.. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని.. తర్వాత తాము కూడా.. ప్రశ్నించడం ప్రారంభిస్తామని అన్నారు.