జ‌గ‌న్‌కు త‌ల‌కొట్టేసినంత ప‌ని!

మ‌రో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ కొలువు దీర‌నుంది. భారీ విజ‌యం న‌మోదు చేసుకున్న టీడీపీ కూట‌మి ఈ స‌భ‌ల‌ను అత్యంత గౌర‌వంగా నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో కీల‌క నేత‌కు స్పీక‌ర్ బాధ్య‌త‌లు ఇచ్చేందుకు కూడా రెడీ అయింది. పేరు బ‌య‌ట‌కు రాక‌పోయినా.. రెండు రోజుల్లో దీనిపైనా క్లారిటీ రానుంది. ఆ వెంట‌నే .. స్పీక‌ర్ ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది. త‌ర్వాత‌.. ఎమ్మెల్యేల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు.

ఆ వెంట‌నే ఈ నెల 18 నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అయితే.. ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ అంతా వైసీపీ గురించే జ‌రుగుతోంది. వైసీపీ గ‌త ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేల‌ను ద‌క్కిం చుకుంది. కానీ, ఇప్పుడు ఈ సంఖ్య 11కు ప‌డిపోయింది. ఇది ఒక‌ర‌కంగా తీవ్ర అవ‌మాన‌క‌ర విష‌య‌మ‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం జ‌గ‌న్‌కు త‌ల‌కొట్టేసినంత ప‌ని!ఈ నేప‌థ్యంలో అస‌లు ఈ 10 మందితో ఆయ‌న క‌లిసి అసెంబ్లీకి హాజ‌రవుతారా? అన్న‌ది స‌మ‌స్య‌.

ఎందుకంటే.. అదే అసెంబ్లీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్ర‌బాబును ఘోరంగా అవ‌మానించిన విష‌యం తెలిసిందే. ఏకంగా చంద్ర‌బాబు శ‌ప‌థం చేసి బ‌య‌ట‌కు వ‌చ్చి.. క‌న్నీరు పెట్టుకునే ప‌రిస్థితిని క‌ల్పించార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు వైసీపీకి ఈ 23లో స‌గం కూడా రాలేదు. దీంతో టీడీపీ నేత‌ల నుంచి ఎంత క‌ట్ట‌డి చేసినా.. క‌వ్వింపులు, ప్ర‌తివిమ‌ర్శ‌లు కామ‌న్‌గానే ఉంటాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. పూలు అమ్మిన చోటే క‌ట్టెలు అమ్మె ప‌రిస్థితి వైసీపీకి వ‌చ్చింది.

దీనికి తోడు.. వైసీపీని తెగ విమ‌ర్శించి.. జ‌గ‌న్ కేసులపై న్యాయ పోరాటం చేసిన‌.. ర‌ఘురామ‌రాజుకే.. స్పీక‌ర్ ప‌ద‌విని కూడా ఇస్తున్న‌ట్టు ప్ర‌చారంలో ఉంది. ఇదే జ‌రిగితే స‌భ‌లో వైసీపీనేత‌ల ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగానే ఉంటుంద‌ని అంటున్నారు. పైగా.. మైకు ఇచ్చే విష‌యంలోనూ.. ప్రాధాన్యం ఏమీ ఉండ‌దు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అస‌లు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టే ప‌రిస్థితి ఉండ‌ద‌ని తెలుస్తోంది. అయితే.. ఎమ్మెల్యేలుగా మాత్రం వారు ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.