త్వరలోనే తాను జిల్లాల పర్యటనకు రానున్న జనసేన అధినేత, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అంతేకాదు.. తనను కలిసేందుకు వచ్చేవారు ఎవరూ కూడా బొకేలు.. శాలువాలు తీసుకురావద్దని ఆయన విన్నవించారు. ఈ మేరకు తాజాగా ఆయన నోట్ విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరగుల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
బొకేలు… శాలువాలు వద్దు
తనను కలిసేవారు.. ఎవరూ పూల బొకేలు.. శాలువాలు తీసుకురావద్దని పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఇందుకు సంబంధించిన షెడ్యూలు కేంద్ర కార్యాలయం ద్వారా తెలియచేస్తాము. అభినందనలు తెలియచేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు.
20వ తేదీ తరవాత పిఠాపురం పర్యటన
ఈ నెల 20 తర్వాత పిఠాపురంలో పర్యటించనున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. తాజా ఎన్నికల్లో ఆయన 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే పిఠాపురంలో పర్యటించి.. ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అదే విధంగా శాసన సభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి. వీటిని పూర్తి చేసుకొని.. నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలను కలుస్తాను. ఈ నెల 20వ తేదీ తరవాత పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుస్తాను. ఆ తరవాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను. అని పవన్ వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates