విధేయతకు వీరతాడు-అనే మాట.. వినడమే కానీ.. రాజకీయాల్లో నిజంగానే ఇలా జరగడం మాత్రం చాలా వరకు అరుదనే చెప్పాలి. ఎందుకంటే.. అనేక మంది నాయకులను దాటుకుని.. పదవులు సొంతం చేసుకోవడం అంటే.. ఎంత విధేయత ఉన్నా.. పెద్ద కష్టమే.
కానీ, ఈ విషయంలో రెండోసారి సక్సెస్ అయ్యారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. వృత్తి రీత్యా వైద్యుడు అయిన.. రామానాయుడు 2012లో టీడీపీలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన పార్టీనే దైవంగా.. అధినేతే దైవంగా పనిచేశారు. నియోజకవర్గం ప్రజలతో ఆయనకు అనుబంధం అంతా ఇంతా కాదు.
నేను విన్నాను.. నేను ఉన్నాను అనే మాట వినడంఅనడమే కాదు.. చేసి చూపించారు. 2014లో తొలిసారి టికెట్ దక్కించుకు న్న నిమ్మల ఆ ఎన్నికల్లోనే విజయం సాధించారు. అప్పట్లోనే ఆయనకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు ఇచ్చేందుకు చూశారు.
కానీ, ఆచంట నుంచి విజయం దక్కించుకున్న పితాని సత్యనారాయణ కారణంగా.. పాలకొల్లుకు ఇవ్వలేక పోయారు. ఇక, ఇప్పుడు కూడా ఆచంటలో పితాని విజయం దక్కించుకున్నా.. గతంలో ఇచ్చిన హామీతోపాటు.. గత ఐదేళ్లుగా నిమ్మల చేసిన కృషిని చంద్రబాబు మరిచిపోకుండా గుర్తు పెట్టుకున్నారు.
2014లో విజయం దక్కించుకున్న నిమ్మల 2019లోవైసీపీ గాలిలోనూ గెలుపు గుర్రం ఎక్కారు. అప్పట్లో టీడీపీ అధికారంలోకి రాలేక పోయింది. అయినా.. కూడా తన నియోజకవర్గంలో ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నారు. సైకిల్ పై తిరుగుతూ.
ఇంటింటికీ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీకి సైతం ఒకానొక సమయంలో ఆయన సైకిల్‌పైనే వచ్చారు. చంద్రబాబు ను అరెస్టు చేసినప్పుడు కూడా.. పార్టీ ఎలాంటి పిలుపు ఇవ్వకముందే.. ఆయన నిరసన చేపట్టారు. ఇక, 2014లో 600 కోట్ల రూపాయలు తెచ్చుకుని నియోజకవర్గాన్ని డెవలప్ చేశారు.
ఇలా.. నిమ్మల కృషి, పార్టీ పట్ల, అధినేత పట్ల ఉన్న విధేయత వంటివి ఇప్పుడు ఆయనకు మంత్రి పీఠాన్ని అందించాయనడం లో సందేహం లేదు. అంతేకాదు.. తమకు పదవులు రాలేదని బాధపడిన వారు ఉన్నారే కానీ.. నిమ్మలకు మంత్రి పదవి వచ్చిందని బాధపడిన వారు లేకపోవడం కూడా.. ఆయన పనితీరుకు, కలుపుగోలు తనానికి పెద్ద ఉదాహరణ.
విధేయతే కాదు.. కృషికి కూడా… నిమ్మలకు ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. ఆయనకు పశుసంవర్ధక శాఖను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోందిపదవి ఏదైనా నిమ్మలతో ఆ పదవికి వన్నె చేకూరుతుందనడంలోనూ సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates