24 మంది మంత్రులతో కలిసి ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, మొత్తం మంత్రి వర్గంలో ముగ్గురు మహిళా మంత్రులకు అవకాశం దక్కించుకున్నారు. ఈ ముగ్గురూ తెలుగుదేశం పార్టీకే చెందిన వారు కావడంతో పాటు, ఈ ముగ్గురూ తొలిసారి మంత్రులు కానుండడం విశేషం.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత 2014లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావు పై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచింది.
2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది. 2019 ఎన్నికల్లో కొవ్వూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ నేత తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యింది. 2021 జనవరి 30న తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఈ ఎన్నికల్లో తిరిగి పాయకరావుపేట ఎమ్మెల్యేగా కంబాల జోగుళుపై 43727 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
మాజీ శాసనమండలి సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి 1999లో కాంగ్రెస్ పార్టీ నుండి సాలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్ చేతిలో 14,970 ఓట్ల మెజారితో ఓడిపోయింది. ఆ తర్వాత టీడీపీలో చేరింది. 2009 ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం నుండి పీడిక రాజన్నదొర చేతిలో 1656 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది. 2015లో శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికై 2021 వరకు పనిచేసింది. 2020 నుండి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా కొనసాగుతున్నది. ఈ ఎన్నికల్లో గతంలో తనను ఓడించిన వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరను 13733 ఓట్ల మెజారిటీతో ఓడించింది.
కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎస్.సవిత పెనుకొండ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి, వైసీపీ అభ్యర్థి ఉష శ్రీ చరణ్ మీద 33388 ఓట్ల మెజారిటీతో తొలిసారి విజయం సాధించింది. సామాజిక న్యాయం పాటిస్తూ చంద్రబాబు నాయుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణికి, బీసీ కోటాలో సవితకు మంత్రులుగా అవకాశం కల్పించడం విశేషం.